
తుంగభద్ర వరద యథాతథం
సాక్షి,బళ్లారి/హొసపేటె: గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటివారంలోనే తుంగభద్రమ్మ కళకళలాడుతోంది. డ్యాంలోకి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో డ్యాం వద్ద 20 క్రస్ట్‌గేట్లను రెండు అడుగులు మేర పైకెత్తి నదికి సుమారు 60 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి ప్రధాన జలాశయమైన తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ఆ మూడు రాష్ట్రాలకు చెందిన ఆయకట్టు రైతులు సకాలంలో పంటలను సాగు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. డ్యాం నుంచి నదికి నీరు వదిలిన తరుణంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ సమీపంలోని పురంధర దాస మంటపం నీట మునిగింది. తుంగభద్ర డ్యాంకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో అనుకున్న సమయం కన్నా ముందుగానే డ్యాం నిండిపోయింది. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్‌గేటు కొట్టుకుపోగా, అనంతరం తాత్కాలికంగా మరమ్మతులు చేసి స్టాప్‌లాగ్ గేటును అమర్చిన సంగతి విదితమే.
లోతట్టుకు పొంచి ఉన్న ముప్పు
అయితే గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో అన్ని క్రస్ట్‌గేట్లను పూర్తిగా మార్చాలని నిపుణులు సూచించినందున తుంగభద్ర డ్యాంలో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి వరద నీటిని నదికి వదులుతున్నారు. దీంతో నదిలోకి భారీ స్థాయిలో నీరు చేరుతోంది. డ్యాంలో ప్రస్తుతం 75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలారు. ఏ క్షణంలోనైనా వరద నీరు మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే నదికి భారీగా నీరు వదలడంతో పురంధర దాస మంటపం మునిగిపోయిన నేపథ్యంలో మరింత నీటి ప్రవాహం పెరిగితే కంప్లి, గంగావతి తాలూకాల్లో నదీ తీర ప్రాంతాల్లో పంటలు నీటమునిగే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో పంటలు నీటమునిగేవి. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో డ్యాంలోకి భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 75.837 టీఎంసీలు, నీటిమట్టం 1624.80 అడుగులు, ఇన్‌ఫ్లో 35,052 క్యూసెక్కులు ఉందని బోర్డు అధికారులు తెలిపారు.
టీబీ డ్యాం వద్ద 20 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
60 వేల క్యూసెక్కులు నదికి విడుదల
హంపీలో పురంధర మంటపం మునక
వరద నీటితో తుంగభద్ర డ్యాంకు జలకళ

తుంగభద్ర వరద యథాతథం