
మహిళను బలిగొన్న వీధికుక్కలు
యశవంతపుర: వీధి కుక్కల దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన గదగ్ జిల్లా గజేంద్రగడ పట్టణంలో జరిగింది. ప్రేమవ్వ చోళిన్ (52) మృతురాలు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున ప్రేమవ్వ పూలు తీసుకురావడానికి బయటకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ సమయంలో వీధి కుక్కల దండు ఆమెను వెంటాడింది. ఓ కుక్క కరవడంతో కింద పడిపోయింది. వెంటనే అన్ని కుక్కలూ ఆమె మీద పడి విచ్చలవిడిగా కరిచాయి. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన మహిళను స్థానికులు కాపాడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కొన్ని గంటలలోపే ప్రేమవ్వ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గజేంద్రగడ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
జనం నిరసన
గతంలో వీధి కుక్కల దాడిలో చిన్న పిల్లలు కూడా చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్ల పక్కన మాంసం వ్యాపారులు వ్యర్థాలను పడేస్తున్నారు. వాటిని ఆరగిస్తూ కుక్కలు యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నాయని, కుక్కల బెడదను మున్సిపల్ అధికారులు అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రేమవ్వ మృతదేహాన్ని చూడడానికి వందలాది మంది జనం ఆస్పత్రికి రావడంతో రద్దీ నెలకొంది. కోపం పట్టలేక నగరసభ అధికారులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దీంతో పోలీసు అధికారులు, తహసీల్దార్ తదితరులు వచ్చి నచ్చజెప్పారు.
గజేంద్రగడలో దారుణం
ప్రజాసంఘాల ధర్నా

మహిళను బలిగొన్న వీధికుక్కలు