
72 గంటల్లోగా అతివృష్టి పరిహారం ఇవ్వాలి
బళ్లారిటౌన్: జిల్లాలో జరుగుతున్న ముంగారు సీజన్‌లో వర్ష నష్టంపై 72 గంటల్లోగా బాధితులకు పరిహారం అందించాలని జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ కేబీ త్రిలోక్‌చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో ఏర్పాటు చేసిన కేడీపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసారి ఖరీఫ్‌లో ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. మరింత వర్షం కురిసే సూచనలు ఉన్నందున ఇప్పటికే జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామన్నారు. ఆయా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో వార్షిక వర్షపాతం 599.5 మి.మీ. ఉండగా ఇప్పటికే 88.4 మి.మీ. నమోదైందన్నారు. జిల్లాలో విత్తనాలు, ఎరువులు సమర్థంగా పంపిణీ చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కీటనాశక మందులు కూడా నాణ్యతగా సరఫరా చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, ఉపకార్యదర్శి గిరిజా శంకర్, వాగీష్ శివాచార్య పాల్గొన్నారు.