
విధి నిర్వహణతో బాధ్యతల వృద్ధి
రాయచూరు రూరల్: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే అధికారుల బాధ్యతలు పెంచుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డా.సుగుణ పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ సేవా పథకంలో విజయం సాధించిన అధికారి సంతోష్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యువజన సేవా పథకంలో చేసిన సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉమాదేవి, స్వరూప రాణి, సరస్వతి, ఆస్మా, రంగనాథ్, వెంకటేష్, రశీద్, పర్వీన్‌లున్నారు.
పిల్లల స్నేహి పాఠశాల షురూ
రాయచూరు రూరల్: శక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ పిల్లల స్నేహి పాఠశాలను జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య శుక్రవారం ప్రారంభించారు. పిల్లలను ఆటల పట్ల మొగ్గు చూపేలా చేయడమే దీని ఉద్దేశమన్నారు. పోలీస్ స్టేషన్ పట్ల చిన్నారుల్లో దాగి ఉన్న భయం తొలిగి పోవాలన్నారు. కుటుంబ సభ్యులు ఇంటిలో పసి పిల్లలను ప్రేమాభిమానాలతో ఆదరించి వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీలు శాంతవీర, ప్రేమానంద్ ఘోడక్, పీఐ, ఎస్‌ఐలున్నారు.
క్రమశిక్షణకు శిబిరాలు దోహదం
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణకు వేసవి శిబిరాలు దోహదపడతాయని హందర్ద్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు గుండూరావ్ దేశాయి అన్నారు. హందర్ద్ ప్రాథమిక పాఠశాలలో పండిట్ తారానాథ్ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ ప్రతిభతో రాణించాలన్నారు. శిబిరంలో విద్యార్థులకు పెయింటింగ్, గీతాలాపన, కథలబోధన, చిత్రలేఖనం, సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారన్నారు.
జొన్నల కొనుగోలుకు వినతి
రాయచూరు రూరల్: రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని కర్ణాటక రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం జిల్లాలోని మాన్వి పట్టణంలోని బసవ సర్కిల్‌లో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలను బంద్ చేసి జొన్నల కొనుగోళ్లను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. రైతులు తెచ్చిన జొన్నలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ అధికారి కృష్ణకు వినతిపత్రం సమర్పించారు.
ఐదు రైల్వే స్టేషన్లు ప్రారంభం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకలోని ఐదు ఆధునికీకరించిన రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మునిరాబాద్, బాగల్‌కోటె, గదగ్, గోకాక్, ధార్వాడ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద గదగ్ రైల్వే స్టేషన్‌ను రూ.23.24 కోట్లు, మునిరాబాద్‌ను రూ.18.40 కోట్లు, బాగల్‌కోటెను రూ.16.06 కోట్లు, గోకాక్‌ను రూ.16.98 కోట్లు, ధార్వాడను రూ.17.1 కోట్లతో ఆధునికీకరించి అభివృద్ధి పరిచారు. 1882లో ప్రారంభమైన గదగ్ రైల్వే స్టేషన్‌లో తాజాగా రెండు లిప్ట్‌లు, ఎస్కలేటర్లు, రెండు చోట్ల వాహనాల పార్కింగ్, పైవంతెన, వైఫై, ఇతర సౌకర్యాలు కల్పించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డి (73) సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. చెళ్లకెరె తాలూకాకు చెందిన కేశవరెడ్డి సోములదొడ్డి వద్ద ఉన్న ఓ బోర్‌వెల్ సంస్థలో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సంస్థ కార్యాలయం నుంచి గోడౌన్‌కు కేశవరెడ్డితో పాటు మరొక వ్యక్తి బైకులో వెళుతూ సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరొక బైకును ఢీ కొట్టారు. కేశవరెడ్డికి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విధి నిర్వహణతో బాధ్యతల వృద్ధి

విధి నిర్వహణతో బాధ్యతల వృద్ధి

విధి నిర్వహణతో బాధ్యతల వృద్ధి