
బాధ్యులపై చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ కర్ణాటక రైతు సంఘం చేపట్టిన ఆందోళన సందర్భంలో అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి కృష్ణను అవమానపరిచే విధంగా మాట్లాడటం తగదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కెమెరామ్యాన్ మృతికి సంతాపం
బళ్లారిటౌన్: ఇటీవల ఓ ప్రైవేట్ చానల్ కెమెరామ్యాన్ సంతోష్(30) అనారోగ్యంతో ఉన్నఫళంగా మృతి చెందడంతో శుక్రవారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అతని చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి పలువురు అతని గుణగణాలను కొనియాడారు. చిన్న వయస్సులో మృతి చెందడం అందరినీ కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార శాఖ అధికారి గురురాజ్, వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, సభ్యులు వెంకోబి, పురుషోత్తం, మహేంద్రకుమార్, కిన్నూరేశ్వర, హరిశంకర్, మారుతీ, రేణుకారాధ్య, వెంకటేష్ కులకర్ణి, హనుమేష్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ కంబారకు
అవార్డు ప్రదానం
హుబ్లీ: అన్ని అవార్డుల కన్నా తన సొంత ఊరైన కర్ణాటక విశ్వవిద్యాలయం హరివే గురు అవార్డు ఇవ్వడం హర్షనీయం అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార తెలిపారు. బెంగళూరులోని తన నివాసంలో కర్ణాటక విశ్వవిద్యాలయ పాలక మండలి బృందం ప్రదానం చేసిన హరివే గురువు అవార్డు స్వీకరించాక ఆయన మాట్లాడారు. కర్ణాటక వర్సిటీ తనదైన ఘనత కలిగి ఉంది. విద్య, సాహిత్యం, కళా రంగాలకు చేసిన సేవలను గుర్తించి సదరు విశ్వవిద్యాలయం అవార్డు ప్రదానం చేయటంపై తాను రుణపడి ఉన్నానన్నారు. సదరు విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన తాను అవార్డు స్వీకరించడం చిరస్మరణీయ క్షణం అన్నారు. ఈ సందర్భంగా ఆ విశ్వవిద్యాలయం గత ఇన్‌చార్జి ఈసీ ప్రొఫెసర్ జయశ్రీ,, రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.చెన్నప్ప, డాక్టర్ ఎన్‌వై మట్టిహాళ, శ్యామ్ మల్లనగౌడర, మహేష్, డాక్టర్ బసవరాజ్, డాక్టర్ ఎంఎం కడకోళ, డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో
● రోజుకు పది వేల క్యూసెక్కులకు పైగా వరద చేరిక
● ప్రస్తుతం డ్యాంలో 6 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
హొసపేటె: మలెనాడులోని తుంగభద్ర పరివాహక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కర్ణాటక జీవనాడి అయిన తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వరద నీటి రాక ప్రారంభమైంది. వేసవిలో డ్యాంలో నీటిమట్టం దాదాపుగా ఖాళీ అయి డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకున్న తర్వాత తుంగభద్ర జలాశయంలోకి ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులకు పైగా పెరిగింది. నాలుగు రోజుల్లో జలాశయంలోకి 6 టీఎంసీల నీరు చేరింది. జలాశయంలోకి నీటి ప్రవాహం లేకపోవడంతో జలచరాలకు సమస్యలు ఎదురయ్యాయి. వేసవిలో ముందస్తుగా కురిసిన వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయంలోకి పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో రైతుల్లో ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది.

బాధ్యులపై చర్యలు చేపట్టాలి

బాధ్యులపై చర్యలు చేపట్టాలి