
యశవంతపుర(కర్ణాటక): తాళి కట్టే సమయంలో, ఈ పెళ్లి వద్దని రచ్చచేసిన పల్లవి అనే వధువు.. చివరకు పంతం నెగ్గించుకుంది. శుక్రవారం హాసన్‌లో ఆదిచుంచనగిరి కళ్యాణ మండపంలో వరుడు వేణుగోపాల్ తాళి కట్టే సమయంలో వధువు వద్దని చెప్పడంతో రభస జరిగింది.
తాను రఘు అనే యువకున్ని ప్రేమించానని, అతనినే పెళ్లాడతానని పల్లవి తెగేసి చెప్పింది. ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పెద్ద గొడవే చెలరేగింది. దీంతో వరుడు, బంధుమిత్రులు అందరూ ఉసూరంటూ వెళ్లిపోయారు. ఆమె ప్రియుడు రఘుకు కాల్ చేసి పిలిపించింది. కుటుంబసభ్యుల సమక్షంలో పల్లవి తాళి కట్టించుకుంది. అదే మండపంలో సాదాసీదాగా ఈ తంతు జరిగింది. సినిమా కథను తలదన్నే ఈ వివాహం హాసన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.