
‘సంచార కావేరి, సరళ కావేరి’కి శ్రీకారం
శివాజీనగర: ట్యాంకర్ నీటి మాఫియాను అరికట్టి, ప్రతి ఒక్కరికీ సక్రమంగా కావేరి నీటిని అందించేందుకు జలమండలి ఆరంభించిన సంచార కావేరి, సరళ కావేరి పథకాలను బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీ.కే.శివకుమార్ శ్రీకారం చుట్టారు. విధానసౌధ మెట్లపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావేరి నీటి సరఫరా ట్యాంకర్లలోని నీటిని తాగటం ద్వారా సంచార కావేరిని ప్రారంభించారు. రూ.1000 చెల్లించిన చిన్న ఇళ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రం ఇవ్వటం ద్వారా సరళ కావేరి పథకాన్ని ప్రారంభించారు. సంచారి కావేరిని జలమండలి వెబ్‌సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేయవచ్చు. విన్నవించిన 24 గంటల్లోగా బీఎస్‌ఐ గుర్తింపు కలిగిన శుద్ధ కావేరి తాగునీరు వినియోగదారుల ఇంటి వద్దకు చేరుతుంది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని మంత్రి తెలిపారు. కావేరి నీటి రుసుమును ఒకేసారి చెల్లించటం కష్టమని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. వారికోసం 12 చెల్లింపుల ద్వారా కావేరి రుసుమును చెల్లించే సరళ కావేరి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం ఫీజులో 20 శాతం సొమ్మును చెల్లించి కావేరి కనెక్షన్ పొంది, మిగతా సొమ్మును 12 చెల్లింపుల్లో చెల్లించేలా సదుపాయం ఈ పథకంలో ఉందన్నారు. ప్రస్తుతం చిన్న ఇంటివారికి (600 చదరపు అడుగుల కొలత) రూ.1000 చెల్లించి కావేరి కనెక్షన్ పొందే సదుపాయాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. శివాజీనగర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, యశ్వంతపుర ఎమ్మెల్యే ఎస్.టీ.సోమశేఖర్, పులికేశినగర ఎమ్మెల్యే ఏ.సీ.శ్రీనివాస్, జలమండలి అధ్యక్షుడు రామ్‌ప్రసాత్ తదితరులు పాల్గొన్నారు.