కాటేసిన కరెంటు తీగ | - | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంటు తీగ

Nov 20 2023 12:28 AM | Updated on Nov 20 2023 7:49 AM

- - Sakshi

సౌందర్య భర్త సంతోష్‌ ప్రైవేటు ఉద్యోగి, సంతోష్‌ స్వస్థలం తమిళనాడులోని ఊటీ కావడంతో అక్కడే ఉంటున్నారు.

కృష్ణరాజపురం: బెస్కాం అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు తీగ తెగి పడి ఉండగా, దానిని తొక్కిన తల్లీ, బిడ్డ ఇద్దరు విద్యుత్‌ షాక్‌తో ప్రాణాలు వదిలారు. ఈ ఘోరం ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, సిలికాన్‌ సిటీలో జరిగింది. మహాదేవపుర నియోజకవర్గంలోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న హోప్‌ ఫార్మ్‌ సర్కిల్‌లో చోటు చేసుకుంది. మృతులు సౌందర్య (23), ఆమె కూతురు సుభిక్ష లియా(9 నెలలు).

నడిచి వెళ్తుండగా
వివరాలు.. సౌందర్య భర్త సంతోష్‌ ప్రైవేటు ఉద్యోగి, సంతోష్‌ స్వస్థలం తమిళనాడులోని ఊటీ కావడంతో అక్కడే ఉంటున్నారు. సౌందర్య ఆదివారం డిప్లొమా పరీక్ష రాయాల్సి ఉండడంతో భర్త, కూతురితో కలిసి బెంగళూరుకు వచ్చారు. ఉదయం 5 గంటలప్పుడు ఏకేజీ కాలనీలో ఉండే సౌందర్య అమ్మవారి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో హోప్‌ఫార్మ్‌ కూడలిలో రోడ్డు పక్కన కరెంటు స్తంభం వైరు తెగి పడి ఉంది, దానిని చూడకుండా సౌందర్య తొక్కడంతో విద్యుదాఘాతం తగిలి మంటలు లేచాయి. సౌందర్య, ఆమె ఎత్తుకుని ఉన్న చిన్నారి బిడ్డ కరెంటు షాక్‌, మంటలతో క్షణాల్లోనే విగతజీవులయ్యారు. ఇద్దరూ పాక్షికంగా కాలిపోయారు. ఇదంతా భర్త కళ్ల ముందే జరిగిపోయింది. సంతోష్‌ గట్టిగా కేకలు వేయడంతో జనం పోగయ్యారు. వారి కుటుంబ సభ్యులు కూడా పరుగున అక్కడికి చేరుకుని ఎంత ఘోరం జరిగిపోయిందని విలపించారు. కాడుగోడి పోలీసులు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

మంత్రి జార్జ్‌ విచారం
బనశంకరి:
కరెంటు షాక్‌తో తల్లీబిడ్డ మృతి ఘటనపై ఇంధన ఽశాఖ మంత్రి కేజే.జార్జ్‌ ట్విట్టర్లో స్పందిస్తూ దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రమాదంపై విచారణ చేపడతామని, నిర్లక్ష్యానికి కారణమైన సంబంధిత ఏఈ, ఏఈఈని సస్పెండ్‌ చేశామన్నారు. ఇంకా ఎవరైనా కారకులు ఉంటే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బెస్కాం సిబ్బందిపై కేసు, విచారణ
ఆ పరిధిలోని ఐదు మంది బెస్కాం అధికారులపై కేసు నమోదైంది. లైన్‌మెన్‌, ఏఈ, ఈఈ, ఏఈఈ, జేఈ తదితరులపై హత్యానేరం కేసు నమోదు చేశారు. డీసీపీ శివకుమార్‌ గుణారె మాట్లాడుతూ బాధ్యులైన బెస్కాం అధికారులపై విచారణ చేపడతామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా రోడ్డు పక్కల ప్రైవేటు టెలికాం కంపెనీల ఫైబర్‌ ఆప్టిక్‌ తీగలు తెగిపడి ఉంటాయి, వాటిని తొక్కినా ఏమీ కాదు. సౌందర్య కూడా అలాగే అనుకుని ఉంటారని పోలీసులు అన్నారు. గతేడాది కూడా కరెంటు తీగలు తగిలిన ప్రమాదాల్లో ఓ మహిళ, యువకుడు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement