మామిడి కాయల అలంకారం

- - Sakshi

తుమకూరు: తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని హులియూరు సమీపంలో ప్రసిద్ధ కుప్పూరు గద్దిగె మహా సంస్థాన మఠంలో గురు మరుళసిద్దేశ్వర స్వామివారికి శనివారం మామిడి కాయలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

20 ఏళ్ల తరువాత

బంగారప్ప కుటుంబానికి..

శివాజీనగర: బీసీ నేతగా గుర్తింపు పొందిన బంగారప్ప కుటుంబానికి 20 సంవత్సరాల తరువాత మళ్లీ మంత్రి మండలిలో అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప శనివారం కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోరబ నియోజకవర్గంలో తన సోదరుడు కుమార బంగారప్పపై గెలుపొంది ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుకున్నారు. కాగా మధు బంగారప్ప, కుమార్‌ బంగారప్పల మధ్య సయోధ్య కోసం పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. ఏదీ ఏమైనా బంగారప్ప కుటుంబానికి 20 సంవత్సరాల తరువాత మంత్రి మండలిలో మళ్లీ అవకాశం లభించినట్లయింది.

ప్రవీణ్‌ నెట్టారు భార్య

ఉద్యోగం తొలగింపు

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారెలో హత్యకు గురైన హిందూ సంఘాల కార్యకర్త ప్రవీణ్‌ నెట్టార్‌ భార్య నూతన కుమారికి గత అక్టోబరులో అప్పటి ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ ఆఫీసులో కారుణ్య నియామకం కింద ఉద్యోగాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక నియమకాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆమెకు కలెక్టర్‌ ఆఫీసులో ప్రకృతి విపత్తుల విభాగంలో క్లర్కుగా ఉద్యోగం చేసేది. కాగా, జిల్లా కలెక్టర్‌ రవికుమార్‌ స్పందిస్తూ, ఆమెను అదే పోస్టులో కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు చెప్పారు.

కాఫీ తోటలో కరెంటు షాక్‌తో..

మైసూరు: రాష్ట్రంలో ఏనుగుల మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చామరాజనగర జిల్లాలో ఒకటి, కొడగు జిల్లాలో రెండు గజరాజులు మృత్యువాత పడ్డాయి. మళ్లీ ఇప్పుడు కొడగులోని కుట్టద వద్ద కరెంటు షాక్‌ తగిలి ఏనుగు కన్నుమూసింది. పొన్నంపేటె తాలూకాలోని కుట్టె గ్రామానికి దగ్గర ఉన్న కుట్టె–నాగరహొళె రోడ్డులోని కాళి గుడి వద్ద కాఫీ తోటలో ఆహారం వెతుక్కుంటూ ఒక ఏనుగు చొరబబడింది. అక్కడ ఉన్న 11 కెవి కరెంటు లైన్‌ వైర్లు తగలడంతో అది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌ గ్యారెంటీలకు నెల గడువు

యశవంతపుర: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెలరోజుల్లో అమలు చేయకుంటే ఆందోళనలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ హెచ్చరించారు. శనివారం ఆయన మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనేదిపై స్పష్టత ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల్లో అమలు చేస్తామని సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు హామీలు ఇచ్చి, ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అని చెప్పటం సరికాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలపై ద్వేష రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దక్షిణ కన్నడ జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

నెహ్రూ అందరికీ స్ఫూర్తి: సీఎం

శివాజీనగర: సమాజంలో శాంతి, సామరస్యతకు భంగం కలిగించే ఏ సంఘంపైనా అయినా కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం సిద్దరామయ్య అన్నారు. శనివారం ధానసౌధ ఆవరణలో దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 59వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో సిద్దు.. నెహ్రూ త్యాగాలు, జీవితం అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. సంఘ పరివార నిషేధం గురించి ప్రభుత్వం చెప్పలేదని అన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top