
బి నాగేంద్ర
సాక్షి,బళ్లారి: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సిద్దరామయ్య మంత్రివర్గంలో బళ్లారి జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గం నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి శ్రీరాములుపై అఖండ మెజారిటీ సాధించిన బి. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్‌లో చోటు దక్కింది. శనివారం కేబినెట్ విస్తరణలో భాగంగా బి. నాగేంద్ర రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ధార్వాడ జిల్లా కలఘటగి నియోజకవర్గం నుంచి గెలుపొందిన జిల్లాలోని సండూరుకు చెందిన మాజీ మంత్రి సంతోష్‌లాడ్‌కు కూడా సిద్దు మంత్రివర్గంలో స్థానం లభించింది. నాగేంద్ర రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా విజయాలతో కేబినెట్ మంత్రి పదవిని సాధించారు.
నాగేంద్ర బయోడేటా:
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి నాగేంద్ర బళ్లారి జిల్లాకు చెందిన బి.ఆంజనేయులు, లక్ష్మీదేవి దంపతులకు 1971లో జన్మించారు. బీకాం వరకు చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖా మంత్రి జయరాంకు సమీప బంధువు కూడా. 2008లో బీజేపీ తరపున కూడ్లిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ్లిగి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీరాములుపై దాదాపు 30 వేల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సిద్దరామయ్య మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంచెలంచెలుగా ఎదిగిన వైనం
జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం