త్రీస్టార్‌ భుజాలకెక్కేనా? | - | Sakshi
Sakshi News home page

త్రీస్టార్‌ భుజాలకెక్కేనా?

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

త్రీస్టార్‌ భుజాలకెక్కేనా?

త్వరలోనే శుభవార్త..

ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతులకు దూరంగా 2012 బ్యాచ్‌ ఎస్సైలు

అప్పటి వారిలో ఇంకా మిగిలిపోయిన 70 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు

ఇటీవల ఏసీపీ పదోన్నతులతో 32 ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఖాళీ

న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎస్సైలు

త్వరలో శుభవార్త చెప్పనున్న డీజీపీ

వారంతా 2012లోనే సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా విధుల్లో చేరారు. నేటికి సర్వీసులో చేరి దాదాపుగా 15 ఏళ్లు కావొస్తున్నా పదోన్నతి లేకుండానే డ్యూటీ చేస్తున్నారు. తమ ముందు బ్యాచ్‌ (2009 ఎస్సైబ్యాచ్‌) వాళ్లకు ఏడేళ్లకు, తమ బ్యాచ్‌లోనే ఎస్సైలకు ఎంపికై న సగం మంది తోటి మిత్రులకు ఎనిమిదేళ్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. కానీ, ఇంకా తమ భుజాలపై మూడు నక్షత్రాలు మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సైలుగా ఎంపికై న తమకు తెలంగాణ వచ్చి సుమారు 15 ఏళ్లవుతున్నా.. ప్రమోషన్లు లేకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అదే క్రమంలో వరంగల్‌, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్ధిపేట కమిషనరేట్లుగా ఆవిర్భవించాయి. దీంతో 2017లో 2009 బ్యాచ్‌ ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు మొత్తం 150 మంది తెలంగాణలో డ్యూటీ చేస్తున్నారు. వీరిలో 80 మంది 2018 నుంచి 2026 వరకు పలు దఫాల్లో ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు సాధించారు. ఇంకా 70 మందికి పదోన్నతులు రావాల్సి ఉంది. వారిలో 60 మంది పదోన్నతికి అన్ని విధాలుగా అర్హులు. డీజీపీగా శివధర్‌ రెడ్డి ఉన్న సమయంలో వీరందరికీ పదోన్నతులు ఇస్తూ జాబితా సిద్ధమైంది. దీంతో ఈ బ్యాచ్‌ ఎస్సైలంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఆయన ఉద్యోగ విరమణ చేయడం, అనంతరం డీజీపీ ఆఫీసు వీరి విషయంలో ఏదో మెలిక పెట్టడంతో పదోన్నతులు నిలిచిపోయాయి. వచ్చినట్లే వచ్చిన పదోన్నతులు చేజారడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది.

చేసేది లేక 2012 బ్యాచ్‌ ఎస్సైలు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌ని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆరు నెలలుగా న్యాయపోరాటాన్ని నమ్ముకుని ఎదురుచూస్తున్నారు. ఇటీవల 2000 బ్యాచ్‌కు చెందిన 32 మంది ఇన్‌స్పెక్టర్లకు ప్రభుత్వం ఏసీపీలుగా పదోన్నతులు కల్పించింది. దీంతో ప్రస్తుతం 32 ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. కనీసం తమకు ఆ ఖాళీలోనైనా సర్దుబాటు చేసి, తమలో 32 మందికి పదోన్నతులు కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆనంద్‌ కూడా వీరి విషయంలో సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే వీరి పదోన్నతుల ఉత్కంఠకు తెరపడనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement