కరీంనగర్: తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై గురువారం రాత్రి ఐడీవోసీ లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలతోపా టు అవసరమైన సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. సాధారణ ప్రసవాలపై వీడియోలు, కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తూ గర్భిణుల్లో అపోహలు తొలగించాలన్నారు. మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరించి, గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణపై చైతన్యం కల్పించాలన్నారు. పాఠశాలలు, కేజీబీవీలు, వసతి గృహాలు, కేంద్రీయ విద్యాలయాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. టీబీ, కుష్ఠు, మలేరియా, డెంగీ తదితర వ్యాధుల నియంత్రణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని, డ్రైడేను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లతోపాటు ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు చేసిన కృషికి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందించిన అవార్డును డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావుకు కలెక్టర్ అందజేశారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.


