కరీంనగర్ అర్బన్: అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కుకు దూరం కాకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో కలెక్టర్ చిత్రామిశ్రా, ఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, హుజూరాబాద్ ఆర్డీవో జలకుమారి తోపాటు ఏఈఆర్వోలతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని, ఫారం–6,7,8 దరఖాస్తులు, పరిష్కరించిన సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బీఎల్వోలు నిబంధనలు పాటించేలా అధికారులు పక్కాగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఈఆర్వోలు మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్లపై దృష్టిసారించి అందుకు గల కారణాలు పేర్కొనాలన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు భద్రపరచాలని ఆదేశించారు.


