● సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్
కరీంనగర్‌క్రైౖం: మేధో వైకల్యం కలిగిన విద్యార్థులకు సరైన విద్య, శిక్షణ, ప్రోత్సాహమందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లోని మనోవికాస్ కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు తల్లిదండ్రులకు దివ్యాంగుల హక్కుల చట్టం–2016, విద్యాహక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. పిల్లలపై జాలి కంటే గౌరవం, సమానత్వం, ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదులు, వైద్యులు, మనోవికాస్ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం మహాశక్తి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించారు. దసరా వరకు 11రోజులు ఆలయం ఆవరణలో ఉంటూ అమ్మవారి సేవలో పాల్గొననున్నారు. ఆలయ ఉత్సవాలను బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీక్షాపరులకు ప్రత్యేక పూజలు, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం
కరీంనగర్ టౌన్: నగరపాలక సంస్థలో ఎనిమిది నెలల బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు. శుక్రవారం నగరంలో మాట్లడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌కు తీసుకొచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కిసాన్‌నగర్‌కు చెందిన సుమారు 150మంది స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరడం గంగుల కమలాకర్ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో బీజేపీ కార్పొరేటర్లు సైతం ఆ పార్టీని వీడే అవకాశం ఉందన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే దుర్గామాత సాక్షిగా ప్రమాణం చేసి తన వాదనను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్, యూసుఫ్, అలీ, గాదె రూప, శ్రీనివాస్, జమ్ము పాల్గొన్నారు.
విద్యుత్ నష్టాలకు కెపాసిటర్ బ్యాంకులతో అడ్డుకట్ట
కొత్తపల్లి(కరీంనగర్): ఓల్టేజీ సమస్యలను తగ్గించి, సాంకేతిక విద్యుత్ నష్టాలను నియంత్రించేందుకు కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎ.విజయేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో 2 ఎంవీఏఆర్ సామర్థ్యం కలిగిన 87,1 ఎంవీఏఆర్ సామర్థ్యం కలిగిన 22 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కెపాసిటర్ బ్యాంకుల వల్ల పవర్ ఫ్యాక్టర్ మెరుగుపడి విద్యుత్ ప్రవాహంలో సాంకేతిక నష్టాలు తగ్గుతాయని వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో కెపాసిటర్ బ్యాంకులు, ఓల్టేజ్ బూస్టర్లు ఏర్పాటు చేస్తూ ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.


