చేతిలో డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టాలు
కొలువుల వేటలో నిరుద్యోగులు
సర్టిఫికెట్ కన్నా ప్రతిభ ముఖ్యమంటున్న కంపెనీలు
అలాంటి వారికి మంచి జీతంతో ఉద్యోగాలు
నైపుణ్యాభివృద్ధికి ‘టాస్క్’
ప్రత్యేక శిక్షణ
జెన్‌జీ కాలంలో విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సర్టిఫికెట్లలో మార్కులను చూసి కొలువులు ఇవ్వగా.. ఇప్పుడు ఆయా రంగాల్లో సాంకేతిక నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తూ.. ప్రతిభ ఉన్నవారిని గుర్తించి రూ.లక్షల్లో ప్యాకేజీలిస్తుండగా.. చదువు పూర్తిచేసి, సర్టిఫికెట్లు చేతిలో పట్టుకుని ఏటా వేలాది మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ‘మీకు ప్రాక్టికల్ నైపుణ్యాలు (స్కిల్ డెవలప్‌మెంట్) లేవు‘ అనే సమాధానం ఎదురవుతుండడంతో చాలా మంది స్కిల్స్ కోసం మళ్లీ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు.
కరీంనగర్ సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సుమారు 115కు పైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జేఎన్‌టీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 11 నుంచి 13 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీలో 45,000కి పైగా సీట్లు అందుబాటులో ఉండగా.. మూడేళ్లలో 50,000 నుంచి 70,000 మంది వరకు విద్యార్థులు డిగ్రీ చదువుతున్నట్లు అంచనా. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా సుమారు 4,500 నుంచి 6,000 వరకు కొత్త అడ్మిషన్లు జరుగుతుంటాయి. నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సును ప్రస్తుతం సుమారు 18,000 నుంచి 22,000 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరిలో 30నుంచి 40శాతం మంది డిగ్రీ పట్టాలతో బయటికి వస్తుండగా.. కేవలం 3నుంచి 5శాతం మంది మంచి ప్యాకేజీలో కొలువు సాధిస్తున్నారు. మిగితావారు ఉద్యోగ ప్రయత్నంలో ఉంటున్నారు.


