కరీంనగర్‌రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి 45 రోజులకోసారి సర్పంచ్‌లు, మండలస్థాయి అధికారుల భాగస్వామ్యంతో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
45రోజులకోసారి ప్రత్యేక సమావేశం
జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, 15 మండల పరిషత్తులున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో మండలపరిషత్ సమావేశాలు నిర్వహించడం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తగా అధికారులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించడం ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని భావించిన ప్రభుత్వం ఇక నుంచి 45 రోజులకోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో తప్పనిసరిగా మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలంటూ గత నెల 27న కరీంనగర్ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ ఎంపీడీవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.
చర్చించే అంశాలివే
మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, మండలస్థాయి అధికారులు పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తారు. సర్పంచులు ప్రస్తావించే సమస్యలకు సంబంధితశాఖల అధికారులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.


