కరీంనగర్‌సిటీ: తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ కడారు సురేందర్ రెడ్డిని కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం ఘనంగా సన్మానించారు. టీజీసీజీటీఏ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికవడం సురేందర్‌రెడ్డి నాయకత్వ పటిష్టతకు నిదర్శనమని కొనియాడారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతీ ప్రాథమిక సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి ఏ.నాగరాజు, టి. రాజయ్య, డాక్టర్ మల్లారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు సైనిక్ విద్యార్థులు
చొప్పదండి: కరీంనగర్‌లో నిర్వహించిన ఐదో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాణించిన రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో 200 మీటర్ల లాంగ్ జంప్ అండర్– 18 విభాగంలో ఆర్.అభిషేక్, అండర్–16 జావెలిన్‌త్రోలో ఇ.వివేకానందు, అండర్–14 విభాగంలో ఎం.గౌతమ్ బంగారు పతకాలు సాధించారు. వంద మీటర్ల పరుగు పందెం అండర్–18 విభాగంలో డి.భరత్‌కుమార్ రజతం సాధించాడు. అండర్– 18 లాంగ్‌జంప్‌లో డి.భరత్ కుమార్, జావెలిన్‌త్రోలో కె.రాంచరణ్‌లు కాంస్యం సాధించారు. విజేతలను డైరెక్టర్ లారా దత్త, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, జేవీపీ ప్రమోద్, పీఈటీ విక్రమ్, సుమన్ అభినందించారు.
శాతవాహనకు రెండు స్వర్ణాలు విరాళం
కరీంనగర్‌సిటీ: వీసీ అమెరికా పర్యటన సందర్భంగా, అక్కడ జరిగిన సదస్సులో ఇద్దరు ఎన్నారైలు తమ చెరో స్వర్ణ పతకాన్ని శాతవాహన విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు న్యూయార్క్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి.రాజశేఖర్ రెడ్డి కాగా, మరొకరు వాషింగ్టన్ డీసీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బి.రవీందర్ రెడ్డి. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు లభించే గొప్ప మద్దతు, గుర్తింపు అని వారు కొనియాడారు.


