పట్టా భూముల నిషేధిత చట్టం 22/ఏ సీలింగ్ యాక్ట్ నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని గతేడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. రేకుర్తి, విద్యానగర్ పరిధిలోని పాత రేకుర్తి గ్రామానికి సంబంధించి 125 సర్వేనంబర్లు 536 ఎకరాలు, విద్యానగర్‌కు సంబంధించి 16 సర్వే నంబర్లు 115 ఎకరాలు మొత్తం 6వేల ఇండ్లు, పదివేల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాకు ఆత్మహత్యలే గతి. – డివిజన్ ప్రజలు, రేకుర్తి, విద్యానగర్, కరీంనగర్
కరీంనగర్ అర్బన్: ‘సమస్యలతో వేగలేకపోతున్నాం.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. రోజులు.. నెలలు గడిచినా పరిష్కారం కావడం లేదు. జర మీరైనా మా సమస్యలను తీర్చరూ’.. అంటూ అర్జీదారులు జిల్లా అదనపు కలెక్టర్లతో ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగి న ప్రజావాణిలో బారులు తీరారు. కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదులు ఇచ్చేందుకు ఆసక్తి చూపగా అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంఽధించిన అర్జీలు రాగా మొత్తం 212 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
గ్రామంలోని సర్వే నంబర్ 109లో 0.28గుంటల భూమిని గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా. ఇప్పటివరకు నాకు ఎలాంటి పాస్‌బుక్ జారీ కాలేదు. అధికారులు నా కుమారుని పేరున పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయండి.
– బోయిని కొమురయ్య, మైలారం
మాది శంకరపట్నం మండలం అంబాలాపూర్. కష్టం చేసి ఎకరంనర భూమిని సంపాదిస్తే ఇద్దరు కొడుకులకు చెరి 30గుంటలిచ్చి నం. ఇప్పుడేమో మాకు తిండి పెడ్తలేరు. దవాఖానాల చూపించుకుందామంటే ఇప్పటికి చేసిన అప్పులు రూ.2.50లక్షలయ్యాయి. అప్పులు కట్టరట.. ఉన్న 10గుంటల భూమిని అమ్ముకోనియరట.
– వడ్లకొండ చంద్రయ్య, లక్ష్మి, అంబాలాపూర్
మొత్తం అర్జీలు: 212,
ఆర్డీవో, కరీంనగర్: 66
హౌజింగ్: 44
కరీంనగర్ కార్పొరేషన్: 42
సీపీ ఆఫీస్: 08


