వేములవాడ: కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలనే గంపెడాశలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యాడు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆర్థికసాయం కోరుతోంది. బంధువులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన నేరెళ్ల సతీశ్(32) రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఒక రోజు అనారోగ్యానికి గురికాగా.. మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే చికిత్స కోసం కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్న సొమ్ము ఖర్చు చేశారు. వైద్యం కొనసాగించేందుకు మరిన్ని డబ్బులు కావాలని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సతీశ్ పూర్తిగా కోలుకోవాలంటే నిరంతరం చికిత్స కొనసాగించాలని వైద్యులు సూచించారని.. దాతలు స్పందించి సాయం చేస్తే బతుకుతాడంటున్నారు. దాతలు 9398936440లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. సతీశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనారోగ్యంతో మంచానికే పరిమితం
కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం
ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు


