బతకాలి.. మరణానంతరం కూడా.. | - | Sakshi
Sakshi News home page

బతకాలి.. మరణానంతరం కూడా..

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

అవయవదానంపై సేవలు అందిస్తున్న ప్రతినిధులు:

ప్రోత్సాహం ఇవ్వాలి

● నేడు జాతీయ అవయవదాన దినోత్సవం ● దానంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పొన్నం మల్లేశంగౌడ్‌ బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం చేయడానికి భార్య రేణుక, కుమారులు భార్గవ్‌, భరత్‌ అంగీకరించారు. వారిగొప్ప నిర్ణయంతో మరో ఆరుగురికి కొత్త జీవితం ప్రసాదించాయి.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పెరుక శ్రీనివాస్‌(43) మంచిర్యాల జిల్లా నస్పూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. దుఃఖంలోనూ ఆయన భార్య సంధ్యారాణి అవయవదానానికి అంగీకరించారు. శ్రీనివాస్‌ లివర్‌, కిడ్నీలు, కార్నియాలను వైద్యులు సేకరించి అమర్చగా.. ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి కంటిచూపు లభించింది.

కోల్‌సిటీ: మరణం మరణం మరో మనిషి జీవితానికి ఆరంభమైతే? చితిలో బూడిదయ్యే గుండె మరో చాతీలో కొట్టుకుంటే.. మూసుకుపోయే కళ్లు.. మరో వ్యక్తికి ఈ ప్రపంచాన్ని చూపిస్తే? డయాలిసిస్‌తో రోజులు లెక్కపెడుతున్న ఓ యువకుడికి మీ కిడ్నీ ప్రాణం పోస్తే? అదే అవయవదానం. ఏటా ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహించడం వెనుక ఉద్దేశం ఇదే.

వైద్యం ఉంది.. అవయవాలే లేవు...

ఆధునిక వైద్యశాస్త్రం గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసే స్థాయికి చేరుకుంది. అయినా వేలాది మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కారణం కాదు... అవయవాల కొరత అంటున్నారు నిపుణులు.

ఒక్క దానం.. ఎనిమిది కుటుంబాల్లో వెలుగు...

బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన ఒక వ్యక్తి అవయవాలను దానం చేస్తే ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్‌, చిన్నపేగుతోపాటు కార్నియాలు, చర్మం, ఎముకలు కూడా పలువురికి ఉపయోగపడతాయి. ఒక కుటుంబం కోల్పోయిన వ్యక్తి.. మరో ఎనిమిది కుటుంబాలకు తిరిగి దొరికిన జీవితంగా మారతాడు.

అపోహలు వీడితే..

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో నేత్ర, అవయవ, శరీర దానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. మానవతా దృక్పథంతో మరణానంతరం కూడా మరొకరికి జీవం అందించాలనే సంకల్పంతో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటం విశేషం. సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,638 నేత్రదానాలు, 160 శరీరదానాలు, 95 అవయవదానాలు విజయవంతంగా పూర్తయ్యాయి.

స్ఫూర్తికి చిరునామా

ఓదెల, అబ్బిడిపల్లి

పెద్దపల్లి జిల్లా ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాలు అవయవ, నేత్రదాన చైతన్యానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తమ మరణానంతరం నేత్రాలు, అవయవాలు దానం చేస్తామని గ్రామస్తులు తీర్మానం చేయగా.. వార్డు సభ్యులతో ఆమోదంతో కలెక్టర్‌, ప్రభుత్వానికి చేరాయి. ఈ రెండు గ్రామాల్లోనే ఇప్పటివరకు సుమారు 250 మంది నేత్రదానం చేయడం వారి సేవా భావానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరణం తర్వాత దానం చేసేవి

● మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్‌, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్‌, పేగులు దానం చేయవచ్చు.

● మరణించిన వ్యక్తి నుంచి ఎనిమిది మందికి అవయవాలను దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్‌, కళ్లని మార్పిడి చేసే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

బతికుండగా దానం చేసేవి...

● కిడ్నీ, కాలేయం, ఎముక మజ్జ .

టి.శ్రవణ్‌ కుమార్‌: 99486 09591

సీహెచ్‌ లింగమూర్తి: 94927 81306

మేరుగు భీష్మాచారి: 98495 90415

కేఎస్‌ వాసు: 98497 37100

కె.రాజేందర్‌: 73962 95999

పి.మల్లికార్జున్‌: 90000 67777

కొదాటి ప్రవీణ్‌: 97013 48999

మరణానంతరం కూడా మరొకరికి జీవం ప్రసాదించే మహోన్నత దానం అవయవదానం. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృత అవగాహన కల్పించాలి. మా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,638 నేత్రదానాలు, 160 శరీరదానాలు, 95 అవయవదానాలు విజయవంతంగా జరిగాయి. నాటో మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవయవదాతల కుటుంబాలకు ప్రోత్సాహకాలు అమలు చేయాలి.

– టి. శ్రవణ్‌ కుమార్‌, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement