20 ఏళ్లు పని చేసిన
● రెండేళ్ల తరువాత మళ్లీ కలుసుకుందాం.. ● విత్తనోత్పత్తి సిబ్బందిపై సంస్థల కత్తి.. ● అకస్మాత్తుగా రెండు వేల మందికిపైగా తొలగింపు
● విత్తన ఎగుమతి లేదంటూ సాకులు ● అధిక దిగుబడి రావడమే కారణమా..? ● సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ టాప్
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఓ వ్యక్తి 25 ఏళ్లుగా ఓ మల్టీనేషన్ విత్తన కంపనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి పనిచేస్తున్న ఆయనను ఇటీవల కంపెనీ తొలగించింది. సమావేశానికి పిలిచి ఈ విషయం చెప్పడంతో కంగుతిన్నాడు. కంపెనీకి లక్ష్యాన్ని మించి దిగుబడి వచ్చిందని, ఉద్యోగుల భారం మోయలేమని చెప్పడంతో ఆయన ఆవేదనకు అంతులేకుండాపోతోంది. ఇది ఈ ఒక్క వ్యక్తి సమస్య కాదు.. రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేయిస్తున్న కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల దుస్థితి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వేల మందికిపైగా ఉద్యోగులను కంపెనీలు తొలిగించాయి. ఇందుకు కారణాలపై ఆరా తీస్తే.. ధాన్యం అధిక దిగుబడి రావడమేనని తెలుస్తోంది. తెలంగాణలో హైబ్రిడ్(ఆడ, మగ) వరికి మంచి డిమాండ్ ఉంది. 48 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. దిగుబడిలో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో, వరంగల్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు అనుకూలం కావడంతో 40కి పైగా కంపెనీలు పోటీ పడి విత్తనాలు ఇస్తున్నాయి. ఈసారి వరి గణనీయమైన దిగుబడి వచ్చింది. ఆ దిగుబడే సిబ్బందికి ఎసరుతెచ్చింది. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కూడా తీవ్రంగా పడింది. వర్షాలు లేక.. వరి సాగు పూర్తిగా పడిపోయింది. దీంతో విత్తనం విక్రయించలేక కంపనీలు చేతులెత్తాశాయి. ఫలితంగా ఏళ్లతరబడి పనిచేసిన వారు రోడ్డున పడుతున్నారు. ఇక్కడ పండిన ధాన్యం ఎక్కువగా పంజాబ్, గుజురాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది.
ఉద్యోగులపై వేటు
రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో హైబ్రిడ్ వరి సాగయ్యిందని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తునారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1.50లక్షల ఎకరాలు సాగైంది. వంద ఎకరాలకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్, 250ఎకరాలకు ఒక సూపర్‌వైజర్, 400ఎకరాలకు ఒక పీవో, వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల వరకు అసిస్టెంట్ మేనేజర్, జిల్లాకు ఒకరు చొప్పున మేనేజర్ ఇలా వందలాది మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజూ వీరు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలను నమ్ముకున్న వీరంతా రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కంపెనీలు తీసేస్తుండడంతో అప్పు ఎలా చెల్లించాలని తలలు పట్టుకుంటున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నుంచి 120మందికి పైగా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తుండగా.. పశ్చిమాసియా యుద్ధం ఎగుమతుల మీద ప్రభావం చూపిందని ఓ ఉద్యోగి తెలిపారు. కంపెనీల నుంచి ఇక సేవలు చాలు అని వచ్చినప్పటి నుంచి సిబ్బంది కూలీనాలి పనులకు వెళ్తున్నారు.
యాసంగిలోనే సాగు..
ఆడ, మగ వరిని కేవలం యాసంగిలోనే సాగు చేస్తారు. వాతావరణం ఆ సమయంలోనే అనుకూలిస్తుంది. ఖర్చుతో కూడిన సాగు అయినప్పటికీ క్వింటాల్‌కు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు వస్తుండడంతో రైతులు దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నాటు వేసిన 45నుంచి60రోజుల మధ్య ఆడ వరి పూతకు వస్తుంది. మగ వరి రేణువులు ఆడ వరిపై పడేలా 15రోజులు తాడుతో దులుపాల్సి ఉంటుంది. ఎకరాాకు ఎనిమిది క్వింటాళ్ల లోపు దిగుబడి వస్తుందని కంపెనీలు అంచనా వేయగా.. 15నుంచి 20క్వింటాళ్లకు పైగా వచ్చింది. ఆ విత్తనాన్ని తిరిగి అమ్ముకోవడం కంపెనీలకు తలకుమించిన భారంగా మారిందని సమాచారం.
ఓ కంపెనీలో 20ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్, సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న. 400 ఎకరాలు చూసుకునేవాడిని. రైతులు కూడా అధిక దిగుబడికి కష్టపడ్డారు. ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కంపెనీ అవార్డు ఇస్తుందనుకుంటే ఉద్యోగం నుంచి తొలిగించింది. కంపెనీకి ధాన్యం ఎక్కువగా వచ్చిందని, రెండేళ్ల తర్వాత మళ్లీ పిలుస్తామని లెటర్ చేతిలో పెట్టింది.
– శ్రీనివాస్, బాధితుడు,
వీణవంక మండలం


