కోతల వెంటే కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

కోతల వెంటే కొనుగోళ్లు

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

● ధాన్యం కొనుగోళ్లపై అధికార యంత్రాగం కసరత్తు ● జిల్లాలో 318 కేంద్రాలు ● సన్నాలకు మద్దతు లేనట్టేనా?

కరీంనగర్‌ అర్బన్‌: ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గతంలో కొనుగోళ్లలో ఉన్న లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. రికార్డులో ఉన్న విస్తీర్ణం ప్రకారమే ధ్రువీకరించనుండగా తదనుగుణంగా రైతుల ఖాతాకు నగదు చేరనుంది. వ్యవసాయ మార్కెట్లకు ఈ సారి కొనుగోలు బాధ్యతలు అప్పగించనుండగా కేంద్రాల సంఖ్యకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.రజనీకాంత్‌, వ్యవసాయశాఖ, ఐకేపీ, మార్కెటింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్‌, మెప్మా, వ్యవసాయ మార్కెటింగ్‌లు కొనుగోళ్లలో భాగస్వామ్యమవనున్నాయి. గతంలో మాదిరిగానే కీలక బాధ్యతలు వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు. యాసంగి ధాన్యం సేకరణకు గానూ 318 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల మూడోవారంలో పంట కోతలు ప్రారంభం కానుండగా కోతల వెంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు.

ఏఈవోలకే బాధ్యత

ఏఈవోల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. జీపీవోల సేవలను వినియోగించనున్నారు. రైతులకు సంబంధించిన భూ భారతి వెబ్‌సైట్‌ను సహకార సంఘాలకు అనుసంధానం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఏఈవోలే సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో సర్వే నంబర్‌ వారీగా పంటల సాగు వివరాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు చేసేవి ఈ సంఘాలే కావడంతో వారు ఏ రైతుకు ఎంత భూమి ఉందనే విషయం ఖరారు చేసుకుంటుంది. దానికనుగుణంగా సంబంధిత ఖాతాకు పంట అమ్మితే వచ్చిన నగదు బదలాయిస్తుంది.

గన్నీ సంచులు, రవాణే సమస్య

జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సిన అవసరం ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం చాలా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. మిల్లర్ల దోపిడీ నిత్యకృత్యంగా సాగింది. ఈ నేపథ్యంలో సదరు సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదిలాఉంటే పదెకరాలున్న రైతుకు పట్టాదారు పాసుపుస్తకంలోనూ రికార్డుల్లోనూ తప్పుగా ఆరెకరాలే అచ్చయించదనుకో.. మిగతా నాలుగు ఎకరాల పంట అమ్ముకోవాలంటే ఇబ్బందులే.

అన్నదాతకు అకాల భయం

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందు కు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తు డిచేస్తోంది. గత సంవత్సరం వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నెలలు గడుస్తాయోనన్న భయం వెంటాడుతోంది.

సన్నాల మాటేమిటి

దొడ్డు రకం ధాన్యం క్వింటాలు ఏ గ్రేడుకు రూ.2389, సాధారణ రకం రూ.2369 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం సన్నరకాలకు ఇంకా వెల్లడించలేదు. సన్నరకం పండించాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు చాలామంది వాటినే ఎంచుకున్నారు. సుమారు 20 వేల ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేసినట్లు అధికారుల అంచనా. 6లక్షల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

జిల్లాలో సాగు విస్తీర్ణం: 3,36,761

జిల్లాలో సాగైన వరి: 2,75,716 ఎకరాలు

రానున్న దిగుబడి: 4.90లక్షల మెట్రిక్‌ టన్నులు

ధాన్యం మద్దతు ధర:

ఏ గ్రేడ్‌: రూ.2,389, సాధారణ రకం: రూ.2,369

కొనుగోలు కేంద్రాలు: 318

ఐకేపీ: 91, పీఏసీఎస్‌: 182

డీసీఎంఎస్‌: 37, హాకా: 08

జిల్లాలో రైస్‌ మిల్లులు: 169

రా రైస్‌ మిల్లులు: 82

బాయిల్డ్‌ రైస్‌మిల్లులు: 87

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement