కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మహత్తరంగా తీర్చేదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన సేఫ్ మదర్స్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. మాతా శిశు కేంద్రంలో అన్ని విభాగాలను సందర్శించారు. గైనకాలజిస్టులు, పిల్లల వైద్య నిపుణులు, రేడియాలజిస్టులతో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో సేఫ్ మదర్ డేకు సంబంధించిన ఐఈసీ మెటీరియల్, పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ కృష్ణ ప్రసాద్, సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీనా, సుధాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయ్ ఆదిత్య పాల్గొన్నారు.
ఆయుష్ ఆధ్వర్యంలో యోగా, వైద్య శిబిరం
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 10న ఆయుష్ కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో యోగా, మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ యశ్రబ్ సుల్తానా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాస్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్‌స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు శేఖర్, సదానందం, డీపీఎం ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
యువతలో స్కిల్స్ పెంచేలా
జిల్లాలోని పరిశ్రమలు, ఆసుపత్రులు తదితర సేవా రంగ సంస్థల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రుచిగుప్తాతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాల కోసం అవసరమైన స్కిల్స్ యువత పెంచుకునేలా చూడాలన్నారు. తమ పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన స్కిల్స్ కలిగిన అభ్యర్థుల కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని సంప్రదించాలని ప్రైవేటు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు.


