కో ఆప్షన్‌కు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌కు వేళాయె!

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

● నేడు నోటిఫికేషన్‌? ● ఏడు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ● అధికార బీజేపీలో పోటాపోటీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో కో– ఆప్షన్‌ పదవుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదు కో ఆప్షన్‌ పదవుల కోసం గురువారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. కొత్త పాలకవర్గం కొలువుతీరిన తరువాత కో– ఆప్షన్‌ పదవులకు ఎన్నిక జరగాల్సి ఉంది. కో ఆప్షన్‌ పదవులు బీజేపీ ఖాతాలో పడనుండగా, ఆ పార్టీలో పోటీ నెలకొంది.

నేడు నోటిఫికేషన్‌

ఆశావహులు ఎంతగానో ఎదురుచూస్తున్న నగరపాలకసంస్థ కో– ఆప్షన్‌ పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ జారీ అయిన నాటి నుంచి ఏడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడు రోజుల తరువాత దరఖాస్తుల పరిశీలన చేపడుతారు. ఐదు పదవులకు ఐదు దరఖాస్తులు వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అలాకాకుండా పోటీ ఏర్పడితే, స్క్రూటినీ అనంతరం మూడు రోజులు గడువు ఇచ్చి, కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి నోటీసు ఇస్తారు. ఆ ప్రత్యేక సమావేశంలో ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు.

మైనార్టీలకు రెండు

ఐదు కో ఆప్షన్‌ పదవుల్లో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ను పాటించాల్సి ఉంటుంది. ఐదింటిలో రెండు మైనార్టీలకు కేటాయిస్తారు. అందులో ఒకరు విధిగా మహిళ ఉండాలి. మిగిలిన మూడింటిలో ఒకటి ఎస్సీలకు, మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. మైనార్టీలకు ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. మిగతా సభ్యులకు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, రిటైర్డ్‌ అయిన గెజిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు. ఆయా రిజర్వేషన్‌ కేటగిరీల వారిగా అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది.

బీజేపీ ఖాతాలోకే

ప్రస్తుత పాలకవర్గం బలాబలాల ప్రకారం నగరపాలకసంస్థలో పూర్తిస్థాయిలో మెజార్టీ ఉన్న బీజేపీ ఖాతాలోనే ఈ ఐదు కో ఆప్షన్‌ పదవులు పడనున్నాయి. బల్దియాలో ప్రస్తుతం అంతగా బలం లేని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కో ఆప్షన్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎక్కడైనా క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం ఏర్పడే పరిస్థితి కోసం ఆ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇక ఐదు కో ఆప్షన్‌ పదవుల కోసం ఆయా కేటగిరీల వారిగా అర్హతలు ఉన్న వాళ్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆశీస్సుల కోసం తమకున్న మార్గాల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement