● కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో వెంకటరమణతో కలిసి సందర్శించారు. అవుట్‌పేషెంట్, ఫార్మసీ స్టోర్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందరం్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 ఏళ్లు పైబడిన మహిళలకు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ తదితర వ్యాధులకు ఉచిత సేవలు పకడ్బందీగా అందించాలని సూచించారు. వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం సరఫరా చేసే మందులనే వాడేలా ప్రోత్సహించాలన్నారు. పీవో ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సన జవేరియా, వైద్యాధికారి ఇమ్రాన్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రారంభించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు, మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ, సీ్త్ర సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి పొందడం ప్రతీ సీ్త్ర ప్రాథమిక మానవ హక్కు అని, ఆరోగ్యంగా ఉన్న సీ్త్ర ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుందని తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్యం సరిగా లేకుంటే బిడ్డ పుట్టిన తర్వాత, జీవితంలో చాలాకాలం వరకు ప్రభావితం చూపుతుందన్నారు. అత్యున్నత ఆరోగ్య వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంచితే మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధా, డాక్టర్లు ఉమాశ్రీ, సాజిదా, డిప్యూటీ డిఎంహెచ్వో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ట్రావెల్స్‌లలో ట్యాక్సీ కార్లు ఉపయోగించాలని మంగళవారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, యూనియన్ అధ్యక్షుడు పున్నం రవి మాట్లాడుతూ, జిల్లాలో కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్ నిజామాబాద్, ఇతర జిల్లాలకు, యాత్రలకు వైట్ ప్లేట్ కార్ల ద్వారా కిరాయిలు తిప్పడంతో ట్యాక్సీ క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైట్‌ప్లేట్ కార్ల అడ్డాలు తొలగించాలని, ప్రభుత్వ శాఖల్లో బినామీ డ్రైవర్ల పేర్లతో వైట్ ప్లేట్ కార్లు తిప్పుతున్నరని ఇలాంటి కార్లపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు వంగల లక్ష్మారెడ్డి, ఎల్దండి చందు, గుంటుకు శ్రావణ్‌కుమార్, నూనిగంటి రాజు, వీణవంక వరుణ్, మాతంగి రమేశ్, మేకల శివకృష్ణ, వంగల యాదిరెడ్డి, నాచారం భాస్కర్, అజయ్, గసికంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సజావుగా రేషన్ పంపిణీ
కరీంనగర్‌అర్బన్: రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతోందని, కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికే జిల్లాలోని 566 రేషన్ దుకాణాలకు మూవ్‌మెంట్ ప్రక్రియ కూడా జరిగిందని వివరించారు. మూడు నెలల బియ్యం పంపిణీ జరుగుతున్నందున ఈ నెల 30వరకు పంపిణీ ఉంటుందని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


