కరీంనగర్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో ఉన్న నిబంధనలను మార్పులు చేసింది. గతంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు మాత్రమే చివరి బిల్లు మంజూరు చేశారు. ఇక నుంచి నివాసం ఉండేందుకు ఇల్లు అనుకూలంగా ఉంటే నిర్మాణం పూర్తయినట్లుగా అధికారులు పరిగణనలోకి తీసుకుని బిల్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు స్లాబ్ దశ పూర్తయి, తుది దశలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ. 5లక్షలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కరీంనగర్ మండలంలో మొదటి విడతలో 1,156 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మొత్తం 629 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 162 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 467 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరికొందరు ప్రస్తుతం మంచిరోజులు కావడంతో కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు.
గతంలో నిబంధనలు
గతంలో ఇంటి ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, పూర్తిస్థాయిలో ఎలక్ట్రికల్ వైరింగ్ తదితర పనులు పూర్తయిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. అనంతరం చివరి బిల్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. చిన్న చిన్న పనులతో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధనలను సడలించింది.
కొత్త నిబంధనల ప్రకారం
ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం ముందుగా లబ్ధిదారులు ఇంటి బయట గోడలకు ప్లాస్టరింగ్ చేసుకున్న అనంతరం లోపలి గోడలకు అవసరాన్ని బట్టి చేసుకునే అవకాశముంది. ఇంటికి పూర్తిస్థాయిలో రంగులు వేయకున్నప్పటికీ, గదుల్లో ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్లంబింగ్ పనులు పూర్తికాకపోయినా, ప్రధాన ద్వారానికి తలుపు బిగించి, లోపలిగదుల్లో తలుపులు పెట్టకున్నా లబ్ధిదారులకు చివరి బిల్లు తీసుకునే అవకాశముంది.


