కరీంనగర్: కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదముందని మెడికవర్ నెఫ్రాలజిస్ట్ రాంచందర్, యూరాలజిస్టు రవిశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో కిడ్నీ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తయారవుతాయని, స్టోన్ చిన్న సైజులో ఉంటే ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల స్టోన్ పడిపోయే అవకాశముందన్నారు. కిడ్నీలో రాళ్లు తయారై రెండు మూడు వారాలకంటే ఎక్కువ సమయం ఉండడం, నొప్పిని తట్టుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడడం, బీపీ, షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం, వంశపారంపర్యం వంటి కారణాలతో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నిర్లక్ష్యం చేయకుండా సర్జరీతో స్టోన్ తొలగించుకోవాలన్నారు. డయాలసిస్‌కు భయపడాల్సిన పనిలేదని, 10ఏళ్ల వరకు కిడ్నీని కాపాడవచ్చన్నారు. కిడ్నీ పూర్తిగా చెడిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో 20–25ఏళ్ల వరకు ఇబ్బంది ఉండదన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, క్రిటికల్ కేర్ నిపుణురాలు పల్లవి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, ఆపరేషన్స్ మేనేజర్ సాయిచరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, హరీశ్, మనోజ్ పాల్గొన్నారు.
మెడికవర్ వైద్యుల వెల్లడి


