హాజరు వివాదం
ప్రొఫెసర్ విషయంలో వెనక్కి తగ్గిన వీసీ
సెమిస్టర్‌కు అనుమతి లేదన్న అధికారులు
మళ్లీ రోడ్డెక్కిన యూనివర్సిటీ విద్యార్థులు
ప్రైవేట్ కాలేజీలకు లేని షరతులు తమకెందుకని నిలదీత
తీవ్ర వివాదాస్పదమవుతున్న వీసీ నిర్ణయాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. హాజరు విషయంలో వర్సిటీ వీసీ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నా రు. హాజరు విషయంలో తమకు కాస్త మినహాయింపు ఇవ్వాలని, లైబ్రరీని 24 గంటల అందుబాటు విషయంలో వీసీ తమ వినతిని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బుధవారం మరోసారి విద్యార్థులు హాజరు శాతం విషయంలో తమకు మినహాయింపు కల్పించాలని కోరుతూ రోడ్డెక్కారు. ఇటీవల న్యాయ విద్యార్థుల హాజరు విషయంలో వీసీ ఆదేశాలు అమలు చేయడంతో పలువురు ఇంటర్నల్స్ రాసే అవకాశం కోల్పోయారు. దీనిపై వందలాది మంది వర్సిటీలో భారీ ఎత్తున ధర్నా చేసిన విషయం విదితమే. తాజాగా సెమిస్టర్ పరీక్షలకు తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు.
నిబంధనల పేరిట కఠినం
వర్సిటీలో చదువుతున్న విద్యార్థుల్లో అధికశాతం బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారే. అందులోనూ ఆయా కుటుంబాల్లో యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్యనభ్యసిస్తున్న తొలితరం వారే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులపై నిబంధనల పేరుతో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుపై ఆధారపడి చదువుతున్న వారే. వీరంతా తిరిగి పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. తమను హాజరుశాతం పేరుతో ఇంటర్నల్స్, సెమిస్టర్స్ రాసే అవకాశం కోల్పోయేలా వీసీ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో అనేక డిగ్రీ, పీజీ, ఎంబీఏ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కడా సరిగా తరగతులు జరగడం లేదు. ప్రైవేటు కాలేజీలకు వర్తించని నిబంధనలు పేద విద్యార్థులమైన తమకు మాత్రం ఎందుకు వర్తింప జేస్తున్నారని వర్సిటీ అధికారులను నిలదీస్తున్నారు. అదే సమయంలో వర్సిటీలో పోలీసుల జోక్యం కొంతకాలంగా పెరిగిపోయిందని వాపోతున్నారు. ప్రతిరోజూ వీసీ పోలీసు బలగాలను పిలిపించి వర్సిటీ ప్రాంగణంలో మోహరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
శాతవాహన వర్సిటీ
వర్సిటీలో జరుగుతున్న ఉద్యమాల విషయంలో ఓ మహిళా ప్రొఫెసర్‌పై వీసీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం నెల రోజుల్లోనే ఆమెను నాలుగు బాధ్యతల నుంచి తప్పించడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. బాధ్యతల నుంచి తప్పించే క్రమంలో రెండుసార్లు ఆర్డర్లు సెలవు దినాల్లో వెలువడటం గమనార్హం. తనపై వరుసగా వెలువడుతున్న ఈ ఆర్డర్ల విషయంపై తీవ్రంగా కలత చెందిన మహిళా ప్రొఫెసర్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు విషయం తెలుసుకున్న ఉమ్మడిజిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీకి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే ఆమెను తప్పించాల్సి వచ్చిందని వీసీ వివరణ ఇచ్చుకున్నారు. వర్సిటీలో కక్ష సాధింపు చర్యలు తగవని మంత్రి హితవు పలకడంతో మహిళా ప్రొఫెసర్ విషయంలో వీసీ వెనక్కి తగ్గి నాలుగోసారి వెలువరించిన ఆర్డర్‌ను బుధవారం అమలు కాకుండా నిలుపుదల చేశారు. ఈ విషయమై వీసీ ఉమేశ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, ప్రచారం సత్యదూరమని ఖండించారు. విద్యార్థుల హాజరు విషయంలో 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారిని మాత్రమే అనుమతించలేదు అని స్పష్టం చేశారు.


