జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం
కరీంనగర్ అర్బన్: రైతు పరిపూర్ణ విజ్ఞానమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగులో ఆధునికతతో పాటు తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం, నాణ్యమైన విత్తనాలు.. ఆరోగ్యకర పంటలకు ప్రాధాన్యత పెరిగేలా కార్యాచరణతో సాగుతోంది. ఉమ్మడి జిల్లా రైతులకు కరీంనగర్‌లో రైతు విజ్ఞాన కేంద్రం ఉన్నది ఒకటే. మూడేళ్ల క్రితం వరకు ఏరువాక కేంద్రంగా సేవలందించగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టిఆర్‌వీకే)గా పేరు మార్చగా కార్యాలయ సేవలను వ్యవసాయ పరిశోధన స్థానంలోకి మార్చారు.
30 ఎకరాలు.. ముగ్గురు శాస్త్రవేత్తలు
రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 30 ఎకరాలు అవసరం. విత్తన ఉత్పత్తితో పాటు ఆధునిక సేద్యాన్ని పరిచయం చేయాల్సి ఉండటంతో విస్తీర్ణం ఎక్కువగా ఉండటమే ఉత్తమం. కరీంనగర్‌లో వ్యవసాయ పరిశోధన స్థానం(ఏఆర్‌ఎస్)లో తాత్కాలిక సేవలందిస్తుండగా దాని వెనుకాలే 30 ఎకరాలు కేటాయించాలని టీఆర్‌వీకే ప్రభుత్వానికి నివేదించింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నూతనంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో స్థల పరిశీలనలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రం కాకుండా అన్ని జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలుండాలని భావిస్తున్న క్రమంలో పోస్టుల సంఖ్య పెరగనుంది. సేద్య విభాగం, విస్తరణ విభాగం, సస్యరక్షణ విభాగానికి క్షేత్రస్థాయిలో సేవలందనున్నాయి. పంటల ఎంపిక, తెగుళ్ల నివారణ, అధిక దిగుబడులు సాధించేలా శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు.
పెరగనున్న పోస్టులు
జిల్లాల వారీగా కేంద్రాలు ఏర్పాటు కానుండటంతో పోస్టుల సంఖ్య పెరగనుండగా యువతకు ఉపాధి దొరకనుంది. ఒక్కో కేంద్రంలో 10మంది సిబ్బంది అవసరం అందులో ముగ్గురు శాస్త్రవేత్తలతో పాటు ఒక ఏఈవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆపరేటర్, ఒక అటెండర్, ప్రొజెక్టర్ ఆపరేటర్, ఫోటోగ్రాఫర్ పోస్టులుండనున్నాయి. వారు 30 ఎకరాల్లో భవనంతో పాటు వివిధ రకాల పంటలను పండిస్తూ విత్తనాలను ఉత్పత్తి చేయనున్నారు. దేశవాళీ పంటలతో పాటు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో కార్యాలయాలు ఏర్పాటవుతాయని, స్థలాన్వేషణ జరుగుతుందని అధికారులు వివరించారు.


