బల్దియా పోరుకు సమాయత్తం
కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ
ఎస్సారార్‌లో ఓట్ల లెక్కింపు
33 నామినేషన్ కౌంటర్లు
1100 జంబో బ్యాలెట్ బాక్స్‌లు
ఏర్పాట్లు పర్యవేక్షించిన నగర కమిషనర్
కరీంనగర్‌కార్పొరేషన్ : నగరపాలకసంస్థ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే ప్రచారానికి అనుగుణంగా ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. పోలింగ్‌కు అవసరమైన జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే సిద్ధం చేయగా.. నామినేషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలకు అనుకూలమైన గదులను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయి బుధవారం పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు జరిగే ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలను కూడా సందర్శించి, అధికారులకు పలు సూచనలిచ్చారు.
రెండు డివిజన్లకు ఒక కౌంటర్
నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే 66 డివిజన్‌లకు సంబంధించి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్లను వెల్లడించడం తెలిసిందే. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు పూర్తి చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరించేందుకు నగరపాలకసంస్థ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. రెండు డివిజన్‌లకు ఒకటి చొప్పున 33 రిటర్నింగ్ అధికారుల గదులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కార్యాలయంలోని పాత, కొత్త భవనాల్లోని హాల్స్‌లో గదులు సిద్ధం చేశారు. గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చే యనున్నారు. 66 డివిజన్‌లకుగాను 33 మంది ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలుగా గెజిటెడ్ అధికారులను నియమించనున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలకు ఉపయోగించిన జంబో బ్యాలెట్ బాక్స్‌లను మున్సిపల్ ఎన్నికలకు కూడా వినియోగించనున్నారు. బాక్స్‌ల కండీషన్‌ను పరిశీలించాక నగరపాలకసంస్థ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. పోలింగ్ బూత్‌కు రెండు చొప్పున (ఒకటి రిజర్వ్) 1100 బ్యాలెట్ బాక్స్‌లను తీసుకోనున్నారు.
ఓట్ల లెక్కింపు ఎస్సారార్‌లో..
నగరంలోని ఎస్సారార్ (ప్రభుత్వ) కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కళాశాలకు తరలిస్తారు. అక్కడి స్ట్రాంగ్ రూమ్‌లలో బాక్స్‌లను భద్రపరుస్తారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల మెటిరియల్ పంపిణి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, బ్యాలెట్ బాక్సులు బద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం ఇక్కడే ఉండనుండడంతో అన్ని గదులను, హాల్స్‌ను కార్పొరేషన్ కమిషనర్ తనిఖీ చేశారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయి అన్నారు. పూర్తిగా నిఘానేత్రాల పర్యవేక్షణ, భద్రత మధ్య ఎన్నికల ప్రక్రియ ఉంటుందన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి గదుల కేటాయింపు, ఫర్నిచర్, సీసీ కెమెరాలు, వసతి సౌకర్యాలపై అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొదలు కొని కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడా, ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, సహాయ కమిషనర్ దిలిప్ కుమార్, ఎస్‌ఈ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ డీసీపీ బషీరొద్దిన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


