గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ గౌస్ ఆలంతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరేడ్ మైదానంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్టేజీ, పార్కింగ్, విద్యుత్, అలంకరణ, సౌండ్ ఏర్పా ట్లు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వశాఖల స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. 108, 102, బాల రక్షక్, సఖి వాహనాలను ప్రదర్శనలో ఉంచాలన్నారు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు పేర్లను పరిశీలించి నివేదికలు పంపాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవాన్ని జయప్రదం చేయండి
జాతీయ ఓటరు దినోత్సవం విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బూత్‌స్థాయి పోలింగ్ అధికారులు నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ, వృద్ధ ఓటర్లకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామం, వార్డుస్థాయిలో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. 25న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కరీంనగర్‌కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పాల్గొన్నారు. రాణి కుముదిని మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, సామాజిక వ్యతిరేక శక్తులను బైండోవర్ చేయాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు మాస్టర్ శిక్షకులు జిల్లాకు చేరుకుంటారని, ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఇతర సిబ్బందిని సిద్ధం చేసుకున్నామన్నారు.


