పనిమంతులకే ప్రశంస
కరీంనగర్ అర్బన్: పనిమంతులకే ప్రశంసాపత్రం అందాలని జిల్లా యంత్రాంగం నిర్దేశించింది. ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర, తెలంగాణ అవతరణ దినోత్సవాల క్రమంలో ఉత్తమ ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేయడం పరిపాటి. అటెండర్ నుంచి జిల్లా అధికారి వరకు ప్రశంసాపత్రాలు ఇవ్వనుండగా విధుల నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబరిచినవారినే గుర్తించాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి సుమారు 180– 220 మంది వరకు ప్రశంసాపత్రాలను అందజేసేవారు. అయితే ఈ సారి గతంలో తీసుకున్నవారిని మినహాయించి పనితీరు, హాజరు, రిమార్కులు లేని వారిని గుర్తించనున్నారు.
పనిమంతులకే దక్కేనా
పలుశాఖల్లో అధికారుల అడుగులకు మడుగులొత్తేవారికి ప్రాధాన్యతనిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 65 శాఖల విభాగాలుండగా 6500లకు పైగా ఉద్యోగులున్నారు. జిల్లా అధికారులను కలెక్టర్ గుర్తించనుండగా కిందిస్థాయి సిబ్బందిని గుర్తించడం ఆయాశాఖల అధికారులకే అధికారం. స్థాయిని బట్టి అటెండర్, నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ అధికారుల క్రమంలో ప్రశంసాపత్రాలు ఇవ్వనుండగా ఒక్కోశాఖ నుంచి 4నుంచి 15మంది పేర్లను పంపనున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జెడ్పీశాఖల్లో ఎక్కువమందికి ప్రశంస దక్కనుండగా ఇతర శాఖల్లో 8నుంచి 12 మందికి దక్కనుంది. చిన్నశాఖలకు 4నుంచి ఆరుగురికి అవార్డులు ఇవ్వనున్నారు.
సకాలంలో జాబితా ప్రకటిస్తారా
ఉత్తమ ఉద్యోగుల జాబితాను ఈ నెల 23లోగా పంపాలని కలెక్టర్ ఆదేశించగా తదనుగుణంగా జాబితా అందుతుందా అన్నది అనుమానమే. ప్రతీ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవం క్రమంలో ఉత్తమ ఉద్యోగుల జాబితా అందించడంలో జాప్యం మీడియాకు ఇబ్బందిగా మారింది. గత ఆరేళ్ల క్రితం వేడుకకు ఒక రోజు ముందే జనవరి 25 సాయంత్రం వరకే జాబితా విడుదల చేసేవారు. కానీ కొన్నేళ్లుగా అదేదో రహస్యమన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అర్ధరాత్రి వరకు వేచిచూసేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ సారైనా సకాలంలో జాబితా చేరేలా కలెక్టర్ చర్యలు చేపడతారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
జిల్లాలో శాఖలు, విభాగాలు: 65
జిల్లా అధికారులు: 60
అధికారులు, ఉద్యోగులు: 6500
నాలుగో తరగతి ఉద్యోగులు: 132


