అందని క్రిటికల్ కేర్ సేవలు
ఆరు మాసాలైనా నియామకం కాని వైద్యులు
సాధారణ సేవలకే పరిమితమైన యూనిట్
కరీంనగర్: చావు బ్రతుకుల మధ్య ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు అత్యవసర చికిత్స అందించాలనే లక్ష్యంతో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ సాధారణ సేవలకే పరిమితమైంది. సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం లేక వెలవెలబోతోంది. ప్రాణాపాయ స్థితిలో వస్తున్న రోగులకు అత్యవసర వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైలు మార్గం కన్నా జాతీయ, రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ ఎక్కువగా ఉండటంతో నిత్యం ఒకటి, రెండు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది ‘గోల్డెన్ అవర్’లోనే జిల్లా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ వైద్యులు లేకపోవడంతో ప్రాణాలు కాపాడే కీలక సమయం వృథా అవుతోందనే ఆరోపణలొస్తున్నాయి.
ఆరుమాసాలైనా నియామకం జరగలేదు
క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, నెఫ్రాలజిస్టు, కార్డియాలజిస్టు వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం ఉన్న వైద్యులే వారి పరిధిలో సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన తల గాయాలు, గుండె సమస్యలు, కిడ్నీ వైఫల్యంతో వచ్చే రోగులకు ఇక్కడ పూర్తిస్థాయి చికిత్స అందడం లేదు. దీంతో క్షతగాత్రులను వరంగల్, హైదరాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రయాణంలోనే రోగుల పరిస్థితి విషమిస్తుండడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోట్లు వెచ్చించినా...
ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.23.75 కోట్ల నిధులు వెచ్చించి క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశారు. 2025 జూలై 27న కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వైద్యుల నియామకం చేయడంలో నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి, పూర్తి స్థాయిలో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.


