చలి వణికిస్తోంది
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..
కరీంనగర్: వారంరోజులుగా జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఉదయాన్నే మంచు పొరలు, తెల్ల వారుజామున చలితో గజగజ వణుకుతున్నారు. పగటి వేళల్లో ఎండ ఉన్నా చల్లగాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రిపూట స్వెట్టర్ లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 12.2 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
జాగ్రత్తలు పాటించాలి
ఉదయం పాఠశాలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల కోసం వెళ్లేవారు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు చలికి ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి గాలులు మొదలై రాత్రంతా తీవ్రత పెరిగిపోతోంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఆ ప్రభావం కొనసాగుతోంది. పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులు, ఆస్తమా, ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తేదీ కనిష్టం గరిష్టం
డిసెంబర్ 6 15.6 29.0
7 15.8 30.7
8 13.3 30.5
9 13.0 29.9
10 13.2 29.5
11 12.2 29.6


