మహిళలకు ఆరోగ్యం.. పిల్లలకు పోషకాహారం
కరీంనగర్‌టౌన్: శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్‌బోర్డ్ కాలనీ అంగన్‌వాడీకేంద్రం పరిధిలో నిర్వహించిన శుక్రవారం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభతో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల చాలామంది రక్తహీనత గురించి తెలుసుకుని అధిగమించారని అన్నారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తు ఉండాలి అనే విషయంపై తల్లులకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. పిల్లలకు పోషకాహారం అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా స్వీకరించాలని సూచించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన చేశారు. మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో సబితాకుమారి, మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి కేంద్రం కౌన్సిలర్ పద్మావతి పాల్గొన్నారు.
‘స్వచ్ఛ ఏవం యు హరిత రేటింగ్’కు ఎంపిక
స్వచ్ఛ ఏవం యు హరిత విద్యాలయ రేటింగ్‌లో జిల్లా నుండి 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాస్థాయిలో చిగురుమామిడి మండలం కొండాపూర్ మండల పరిషత్ పాఠశాల, ఇస్లాంనగర్ మండల పరిషత్ పాఠశాల, తిమ్మాపూర్ ఉర్ధూ మీడియం పాఠశాల, గంగాధర మండలం ఒడ్యారం జిల్లా పరిషత్ హైస్కూల్, మానకొండూర్ మండలం పచ్చునూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, జమ్మికుంట ధర్మారం పీఎంశ్రీ పాఠశాల, కరీంనగర్ కుమ్మర్వాడి పాఠశాల ఎంపికయ్యాయి.


