హాట్‌సీట్‌గా.. ఉప సర్పంచ్
కరీంనగర్‌రూరల్: రిజర్వుడ్ పంచాయతీ స్థానాల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. రూ.లక్షలు ఖర్చు చేసి ఉపసర్పంచ్ సీటును దక్కించుకున్నారు. సర్పంచ్ పదవి ఎస్సీ, మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ నెలకొంది. మెజార్టీ వార్డు సభ్యుల మద్దతు కూడగట్టేందుకు రూ.లక్షలు ఖర్చుచేసి పదవిని దక్కించుకున్నారు. కరీంనగర్ మండలంలో ప్రధాన గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి అభ్యర్థులు ఖర్చుపెట్టిన స్థాయిలో ఉపసర్పంచ్ పదవికోసం వార్డుసభ్యులకు రూ.లక్షలు చెల్లించా రు. ఓ గ్రామంలో ఉపసర్పంచ్ బరిలో ఉన్న నాయకుడు మిగితా వార్డు సభ్యుల మద్దతు ముంద స్తుగానే సాధించాడు. మరో గ్రామంలో ఉపసర్పంచ్ పదవిని ఓ వార్డుసభ్యుడు అత్యధిక డబ్బులు చెల్లించి దక్కించుకున్నట్లుగా సమాచారం.
అర్ధరాత్రి వరకు ఉపసర్పంచ్ ఎన్నిక
కరీంనగర్ మండలంలో మొత్తం 14 సర్పంచ్,100 వార్డు స్ధానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ముందుగా వార్డు స్ధానాలకు వచ్చిన ఓట్లను అధికా రులు లెక్కించిన అనంతరం సర్పంచ్ స్ధానాల ఓట్లను లెక్కించారు. చేగుర్తి, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ రాత్రి 7గంటలవరకు సర్పంచ్ ఫలితాలు ప్రకటించారు. చామనపల్లి సర్పంచ్ ఫలితం రాత్రి 9గంటలకు, నగునూరు సర్పంచ్ ఫలితం రాత్రి 11గంటలకు ప్రకటించారు. ఉపసర్పంచ్ పదవి కోసం పోటిపడిన అభ్యర్థులు అప్పటికప్పుడే వార్డుసభ్యులకు రూ.లక్షల్లో చెల్లించేందుకు ఒప్పుకోవడంతో అన్నిగ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది.


