
మాట ఇచ్చి.. ఆస్పత్రి బిల్లు చెల్లించి
గంగాధర(చొప్పదండి): అభివృద్ధి పనులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ భర్తకు రూ.4 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన తాళ్ల విజయలక్ష్మి సర్పంచుగా పని చేసింది. తన పదవీకాలంలో అభివృద్ధి పనులు చేసి దాదాపు రూ.10 లక్షల అప్పులు చేసింది. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు చెల్లించలేక మనస్తాపానికి గురైన విజయలక్ష్మి భర్త రవీందర్ ఈనెల 14న పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. బాధితున్ని ఎమ్మెల్యే సత్యం పరామర్శించి ఖర్చులు భరిస్తానని భరోసా ఇచ్చారు. మాట ప్రకారం గురువారం రవీందర్ డిశ్చార్జ్ కాగా రూ.4 లక్షలు చెల్లించారు. మాజీ సర్పంచ్ బీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అయినా సాయం చేయడంపై ప్రజలు అభినందిస్తున్నారు.