ఖాళీ కొలువులపై కసరత్తు | - | Sakshi
Sakshi News home page

ఖాళీ కొలువులపై కసరత్తు

Jul 25 2025 8:02 AM | Updated on Jul 25 2025 8:02 AM

ఖాళీ కొలువులపై కసరత్తు

ఖాళీ కొలువులపై కసరత్తు

శాఖలవారీగా ఖాళీల ఆరా

ఆశల వలయంలో నిరుద్యోగులు

కరీంనగర్‌ అర్బన్‌: సర్కార్‌ కొలువుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేయగా, తాజాగా ఖాళీల వివరాలు సేకరిస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రతీ శాఖలో ఉన్న సాంక్షన్‌ స్ట్రెంత్‌ ఎంత? ఉన్నవారెంత? ఖాళీలెన్ని? అనే కోణాల్లో నివేదికలు రూపొందిస్తున్నారు. గతంలోనే శాఖల వారీగా ఖాళీలను నివేదించిన జిల్లా యంత్రాంగం మరోసారి వివరాలు రాబడుతోంది. జిల్లాస్థాయిలో 65 విభాగాల వరకు ఉండగా అటెండర్‌ నుంచి అధికారి వరకు ఖాళీల లెక్క తీస్తున్నారు. గత కొన్నేళ్లుగా అరకొర పోస్టులు మినహా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్‌ రాలేదు. జిల్లాలో చాలా శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రకటన దరిమిలా త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తయితే ప్రజలకు సత్వర సేవలందడం అనివార్యమే. జిల్లా వ్యాప్తంగా 1,500ల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని శాఖల్లోనూ ఖాళీలు

ప్రభుత్వ విభాగాల్లో దాదాపు అన్నింటా ఖాళీలే. పాత జిల్లా ప్రకారమే 25 శాతం ఖాళీ పోస్టులు వెక్కిరించాయి. ఇక జిల్లాల విభజన అనంతరం 35–40 శాతం వరకు ఖాళీలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడగా ఇక్కడి ఉద్యోగులనే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేశారు. శాఖలవారీగా మంజూరు పోస్టులకు ఉన్న పోస్టులకు ఒక్కో శాఖలో 50 శాతం ఖాళీలున్నాయని స్పష్టమవుతోంది. ప్రధానంగా విద్య, పోలీస్‌ శాఖల్లో ఎక్కువ ఖాళీలున్నట్లు గుర్తించారు. అలాగే రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానశాఖ, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్‌, ట్రెజరీ, సర్వేలాండ్‌ రికార్డ్స్‌, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ, డీపీఆర్వో, వైద్యశాఖల్లో ఖాళీలున్నాయి. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌(లో ఫిమెల్‌ లిట్రసీ) పోస్టులు మినహాయిస్తే బోధన సిబ్బంది పోస్టులు 1,216 వరకు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల ద్వారా ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీచేస్తే మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. పోలీస్‌ శాఖలో జిల్లా పరిధిలో అన్ని కేటగిరీల్లో 250 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడాశాఖలో అడ్మినిస్ట్రేట్‌, కోచింగ్‌, రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌, టీచింగ్‌, హాస్టల్‌, మెడికల్‌ స్టాఫ్‌ అంతా కలిపి 111 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మున్సిపల్‌లో అన్ని కేటగిరీల్లో 270, వ్యవసాయ శాఖలో 11, పంచాయతీరాజ్‌లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో వివిధ కేటగిరీల్లో 120 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ శాఖల్లో మరో 500ల వరకు భర్తీ అయ్యే అవకాశముంది.

వయోపరిమితి పెరిగేనా?

తాజాగా ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితి పెంచాలనే డిమాండ్‌ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు 2017లో ప్రభుత్వం పదేళ్ల మేర పొడిగించింది. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అదనంగా మరో ఐదు ఏళ్లు పొడిగించింది. పోలీస్‌ కొలువులకూ మూడేళ్లు వయోపరిమితి పెంచారు. సదరు జీవో 2024 వరకే అమల్లో ఉండనుండగా జీవో కాలపరిమితిని పొడిగిస్తారా.. లేదా వేచిచూడాల్సిందే.

కొత్త జోన్ల ప్రకారమే నియామక ప్రక్రియ

నియామకాల్లో ఏస్థాయి పోస్టులైనా 95 శాతం పోస్టులు మనకే. స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా కరీంనగర్‌ను రాజన్న జోన్‌గా ఖరారు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్‌లో ఉండగా గతంలో నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉండేది. జోనల్‌ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్‌ కేటగిరీ, రాష్ట్రస్థాయి పోస్టుల్లో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్‌ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. కాగా.. ఇక జిల్లా, జోనల్‌, రాష్ట్రస్థాయి పోస్టులన్నింటికి 95 శాతం స్థానికత ఐదు శాతం స్థానికేతరులకు కేటాయించిన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement