
సీఎం దృష్టికి వరద సమస్య
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేందర్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్: భారీవర్షాలు పడిన ప్రతిసారీ నగరంలో తలెత్తుతున్న వరద సమస్యను సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, శాశ్వత పరిష్కారం దిశగాకృషి చేస్తానని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలైన సుభాష్ నగర్, వావిలాలపల్లి, ఆదర్శనగర్, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, సాహెత్‌నగర్, కమాన్, లక్ష్మీనగర్, గాయత్రి నగర్‌లను గురువారం పరిశీలించారు. ఇండ్లల్లోకి వరద చేరడంతో వంటసామగ్రి తడిసిన బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేలా చూడాలని ఆర్డీవో మహేశ్వర్‌కు ఫోన్‌చేసి కోరారు. గత బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యం మూలంగా భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి నగరం ముంపునకు గురవుతుందని విమర్శించారు. మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లి,నగరం ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషిచేస్తామన్నారు. మాజీ కార్పొరేటర్లు చంద్రశేఖర్, గంట కల్యాణి, కట్ల సతీశ్, కోటగిరి భూమాగౌడ్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీనివాస్, రాజకుమార్ పాల్గొన్నారు.
ఫీవర్ సర్వే నిర్వహించాలి
● డీఎంహెచ్‌వో వెంకటరమణ
కరీంనగర్‌టౌన్: వర్షాకాలంలో జ్వరాలు పెరిగే అవకాశం ఉన్నందున ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆదేశించారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించి జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలు మెడికల్ ఆఫీసర్ దృష్టి తీసుకెళ్లి హెల్త్ క్యాంపు ఏర్పాటుచేయాలన్నారు. శుక్రవారం సభ రిపోర్టును గ్రామాలవారీగా అప్డేట్ చేసుకోవాలని, ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని, బ్రెస్ట్ క్యాన్సర్‌పై స్వీయ పరీక్ష చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డీఐవో సాజిదా, జిల్లా మలేరియా అధికారి రాజగోపాల్ రావు, పీవో ఎన్సీడి విప్లవశ్రీ, డెమో రాజగోపాల్, డీపీహెచ్‌ఎన్‌వో విమల, డీపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి
● కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
వీణవంక: ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్ పరిశీలించి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, విజిబుల్ పోలీసింగ్ దృష్టి పెట్టాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. రౌడీ, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా ఆవరణలో మొక్కలు నాటి, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 40 మందికి గొడుగులు అందించారు. మండల పరిధిలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై తిరుపతి ఉన్నారు.
నేటి నుంచి ‘దోస్త్’
స్పెషల్ షెడ్యూల్
కరీంనగర్‌క్రైం: ఈ విద్యాసంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు దోస్త్ చివరి విడత స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బుధవారం తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో జూలై 25 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఆగస్టు 3న స్పెషల్ ఫేస్ అడ్మిషన్ల అలాట్‌మెంట్ ప్రకటన వస్తుందని, సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 3 నుంచి 6 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఆగస్టు 4 నుంచి 6లోగా కళాశాలల్లో ఒరిజినల్ టీసీ, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో రిపోర్టు చేయాల్సి ఉంటుందని, చేయకపోతే సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.

సీఎం దృష్టికి వరద సమస్య

సీఎం దృష్టికి వరద సమస్య