
వరద ముప్పు.. ఎవరిదీ తప్పు!
బాధ్యులు ఎవరు?
● రెండుగంటల వానకే నిండా మునిగిన స్మార్ట్ సిటీ ● డ్రైనేజీ నిర్మాణంలో ముందు చూపు కరువు ● సామర్థ్యం లేని నాలాలు, కాలువలే అసలు సమస్య ● నగరం విస్తరణకు అనుగుణంగా లేని ప్లానింగ్ ● కలెక్టరేట్, కమిషనరేట్ ప్రాంగణాలు మునిగిన దృశ్యాలు వైరల్
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
పేరుకు మనది స్మార్ట్ సిటీ కానీ గట్టిగా రెండు గంటలు వాన కురిస్తే.. మాత్రం ప్రధాన జంక్షన్లు, వీధులు నీట మునుగుతాయి. అక్కడిదాకా ఎందుకు కలెక్టరేట్ ప్రాంగణం, పోలీసు కమిషనరేట్ ప్రాంగణాలు వరదతో పోటెత్తుతాయి. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కదా.. డ్రైనేజీ వ్యవస్థ ఉంది కదా? అయినా ఎందుకు ఈ కష్టాలు అనే కదా మీ సందేహం? అక్కడికే వస్తున్నాం.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మన బల్దియా ఇంజినీరింగ్ అధికారులు, గత పాలకుల ప్రణాళిక లోపంతో ఈ వరదలు. బుధవారం ఉదయం రెండు గంటలపాటు కురిసిన కేవలం 9 సెంటి మీటర్ల వానకు కలెక్టరేట్, కమిషనరేట్, గీతాభవన్, మంచిర్యాల చౌరస్తా, వీపార్క్ ఎదురుగా ప్రతీ చోటా వరద ఏరులై పారింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుండటం కరీంనగర్ బల్దియా పరువు వరదలో కలిిసినట్లయింది.
● నాలాల్లో అనేక నిర్మాణ లోపాలు ఉన్నాయి. కాలువల అనుసంధానంలోనూ ఇదే సమస్య. రాంనగర్ నుంచి మంకమ్మతోట టూటౌన్ వరకు ఎగువ నుంచి వచ్చే కాలువల సామర్థ్యం, దానిని అనుసంధానం చేసే కాలువల సామర్థ్యం చిన్నగా ఉండటం వల్ల వరద పోటెత్తి రోడ్ల మీదకు వస్తోంది. మంచిర్యాల చౌరస్తా, వీపార్క్ హోటల్, గీతాభవన్ చౌరస్తాల వద్ద ఇదే సమస్య.
● స్మార్ట్‌సిటీలో భాగంగా కట్టిన నాలాలు, వరద వెళ్లేలా నిర్మించిన ఓటౌవెంట్‌ల సామర్థ్యం మరింత పెంచాలి. 2022లో ఇదే విషయాన్ని సాక్షి ఎత్తి చూపగా.. కాస్త పెంచారు. కానీ, మరింత పెంచాల్సిన అవసరముంది. ఒకవేళ రోజంతా వర్షంకురిసి, 15 సెం.మీలు అంతకుమించి కురిస్తే.. నగరం పరిస్థితి ఏంటి? అన్న విషయం బల్దియా అధికారులే చెప్పాలి.
నగరంలో ప్రధానంగా
మూడు నాలాలు
● మొదటి నాలా పోలీసు శిక్షణా కేంద్రం (పీటీసీ) నుంచి ప్రారంభమై రాంనగర్, జ్యోతినగ ర్, ముకరంపుర, కలెక్టరేట్, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్నగర్, లక్ష్మినగర్ మీదుగా బైపాస్ దాటి ఎల్లమ్మ గుడి సమీపంలో వాగులో కలుస్తోంది.
● రెండోది కోర్టు ప్రాంతంలో ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి, శర్మనగర్, సాయిబాబా ఆలయం, రైతుబజార్, బొమ్మవెంకన్న భవనం, గోపాల్చెరువు మీదుగా పోతుంది.
● మూడో నాలా రాంపూర్లో ప్రారంభమై అలకాపురికాలనీ, సిరిసిల్ల బైపాస్, డీమార్ట్, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వాగులో కలుస్తుంది.
సమస్య..
నాలాలు, వాటిలో కలిసే డ్రైనేజీలు ఒక్కోచోట ఒక్కోరకంగా ఉండడం. డ్రైనేజీల లింక్‌లు సరిగాలేకపోవడం. పీటీసీ నుంచి జ్యోతినగర్ వరకు నాలా 6 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వెడల్పుతో ఉండగా, ముకరంపురకు వచ్చే సరికి 2 ఫీట్ల నుంచి 4 ఫీట్లకు కుచించుకుపోయింది. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో విమానం వీధి మునగడానికి ఇదో కారణం.
ముంపుప్రభావిత ప్రాంతాలు..
ముకరంపుర, మంచిర్యాలచౌరస్తా, ఆర్టీసీ వర్క్‌షాప్, కలెక్టరేట్ రెండో గేట్, పోలీసు హెడ్‌క్వార్టర్స్, ఆటోనగర్, కేబుల్ బ్రిడ్జి బైపాస్.
నగరంలోని డివిజన్‌లు: 60 (పాతవి)
నగర జనాభా : 3 లక్షల
50 వేలు (సుమారు)
నాలాలు : 03
డ్రైనేజీలు : 624 కిలో మీటర్లు
రోడ్లు : 758 కిలో మీటర్లు
కారణాలు ఇవే..
సరిగా నిర్వహించని డ్రైనేజీ వ్యవస్థలు, వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేయడం వల్ల వర్షపు నీటిలో కలిసి చెత్త చేరుతోంది.
ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ క్రింద సిటీ లో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించాల్సిన స్టార్మ్ వాటర్ డ్రైనేజిల నిధులు విలీన గ్రామాలకు మళ్లించి, పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్తను నిర్మించి అనుసంధానం చేయకపోవడం.
డీపీఆర్ నిర్మించే సమయంలో డ్రైనేజీలో ఉన్న తీసుకొన్న నీటి మట్టాలు, ప్రవాహ ఉద్ధృతి, డ్రైనేజీ నిర్మించే క్రమంలో పెట్టిన లెవల్స్ వ్యత్యాసంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పక్కన పెట్టి సైడ్ ఓపెన్ డ్రైన్‌లను సివరేజీ డ్రైన్‌ల కింద కన్వర్ట్ చేయడం, పేలవమైన నాణ్యత నిర్మాణాలు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ చేపట్టకపోవడం.
మెయిన్ రోడ్డులలో నిర్మితమైన స్టార్మ్ వాటర్ డ్రైన్ యొక్క సైజును కుదించి .. కేబుల్స్ వేయడం కోసం స్పేస్ ను కేటాయించడం, వాటిని కూడా ఉపయోగించుకోకపోవడం కూడా సమస్య కారణంగా నిలుస్తోంది.
డ్రైన్ల నిర్మాణంలో భవిష్యత్తు అవసరాలను, జనాభా పెరుగుదలను ముందు చూపు లేకుండా కేవలం తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించి నగర భవిష్యత్తును బలిపెట్టారు.
ప్రభావిత ప్రాంతాల పరిశీలన
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. వరదతో మునిగిన మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, సాహెత్‌నగర్, సాయినగర్, సుభాశ్‌నగర్‌తో పాటు నాలాలు, డ్రైనేజీలను తనిఖీ చేశారు. డ్రైనేజీలు, నాలాల్లో చెత్తాచెదారం అడ్డుపడకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షం పడితేచాలు తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, పరిష్కారం చూపాలని మాజీ కార్పొరేటర్‌లు మెండి చంద్రశేఖర్,గంట కల్యాణి శ్రీనివాస్‌లు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ డంప్‌యార్డ్‌ను సందర్శించి, వాహనాలను రోడ్డుపై నిలపకుండా చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, ఏసీపీ వేణు తదితరులు పాల్గొన్నారు.

వరద ముప్పు.. ఎవరిదీ తప్పు!

వరద ముప్పు.. ఎవరిదీ తప్పు!