
కార్పొరేట్ గోల్‌మాల్
శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025
● ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్లు.. అకాడమీల్లో తరగతులు ● కోచింగ్ సెంటర్ల పేరిట ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారం ● పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు ● ఒక కళాశాలలో చేరిన వారికి మరో కోచింగ్ సెంటర్లలో శిక్షణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
నగరం నడిబొడ్డులోని గణేశ్‌నగర్‌లో ఓ జూని యర్ కళాశాల ఉంది. పేరుకు అది ప్రైవేటు కళాశా ల. పేరు, బోర్డు అన్నీ బాగానే ఉంటాయి. దాదాపు 900కుపైగా అడ్మిషన్లు ఉన్నాయి. ఇక్కడ ఖాళీ బిల్డింగు, బెంచీలు తప్ప మరేం లేవు. విద్యార్థులు అసలే లేరు. విద్యార్థులు లేకున్నా, ఉన్నట్లు.. తరగతులు జరగకున్నా జరిగినట్లు.. ప్రాక్టికల్స్ లేకున్నా చేసినట్లు మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్లు ఇదంతా ఔట్ సోర్సింగ్ ప్రక్రియలా చేస్తున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్‌కు ఈ విద్యార్థులను సరఫరా చేస్తున్నారని సమాచారం.
కోచింగ్ సెంటర్ల హవా
కరీంనగర్‌లో కొందరి కోచింగ్ సెంటర్ల హవా నడుస్తోంది. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట అకాడమీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరిది రూ.కోట్లలో వ్యాపారం. బహుళ అంతస్తుల భవనాలు, అద్దాల మేడలు, ఆకర్షణీయమైన ప్రచారం, బ్రాండ్ అంబాసిడర్లతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. కోచింగ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. విద్యార్థి అడ్మిషన్ రాసే సమయంలో అసలు బుద్ధి బయట పెట్టుకుంటున్నారు. తమ కోచింగ్ సెంటర్‌లో చేరినవారికి ముందే సృష్టించి పెట్టుకున్న జూనియర్ కళాశాలలో అడ్మిషన్ రాస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సదరు జూనియర్ కళాశాల వైపు ఏనాడూ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
అధికారులు పట్టించుకోరా?
నగరంలో చాలావరకు కోచింగ్ సెంటర్లను ఉత్తరాది పేర్లతో నడిపిస్తున్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వీటిలో 99శాతం అకాడమీలకు ఎలాంటి అనుమతులు లేవు. అలాంటివారిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తున్నారే తప్ప విద్యార్థులు లేని కళాశాలలపై కొరడా ఝుళిపించడం లేదు.
కేసులు పెట్టాలి
జిల్లాలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేదు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఒకచోట, తరగతుల నిర్వహణ మరొక చోట చేస్తున్న ఇంటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కళాశాలలపై చీటింగ్ కేసు నమోదు చేసి, ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. – కసిరెడ్డి మణికంఠ రెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

కార్పొరేట్ గోల్‌మాల్

కార్పొరేట్ గోల్‌మాల్

కార్పొరేట్ గోల్‌మాల్