
లోటు నుంచి సాధారణ వర్షపాతం
● మూడు మండలాల్లో సాధారణానికి మించి నమోదు ● నిండుతున్న చెరువులు, జోరందుకున్న నాట్లు ● సాగురంగానికి ప్రయోజనం
కరీంనగర్ అర్బన్: జిల్లాలో మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియగా వాగులు, వంకలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఇన్నిరోజులు వర్షాలు లేక వెలవెలబోయిన పొలాలు నాట్లతో ఊపందుకుంటున్నాయి. ఎగువన ఎస్సారెస్పీ జలాశయం ఆశాజనకంగా ఉండగా, దిగువ మానేరు, మధ్యమానేరు జలాశయాల్లో ఇప్పుడిప్పుడే నీటిమట్టం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు నిండి ప్రవహిస్తుండగా ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. జిల్లాలో కరీంనగర్, హూజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లుండగా దాదాపు అంతటా ఆశాజనకమే. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు స్వల్ప తేడాతో లోటు వర్షపాతంగా నమోదవగా మిగతా మండలాలన్ని సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. జిల్లాలో వరి ప్రధాన సాగు కాగా 2.70లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అధికారుల అంచనా. వారం రోజుల క్రితం వరకు 40వేల ఎకరాలే సాగవగా తాజాగా లక్ష ఎకరాలను దాటింది. మరోవారం రోజుల్లో అధికారుల అంచనాను చేరుకోనుంది.
మూడు రోజులుగా జిల్లాలో నమోదైన వర్షపాతం
కరీంనగర్ అర్బన్ మండలంలో 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మానకొండూరులో 16.3, కరీంనగర్ రూరల్‌లో 15.8, వీణవంకలో 14.8, చొప్పదండిలో 11.2, జమ్మికుంటలో 14.7, హుజూరాబాద్‌లో 11.2, తిమ్మాపూర్ 9.0, ఇల్లందకుంట 15.9, శంకరపట్నంలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సగటున వర్షపాత వివరాలు
నెల సాధారణం నమోదైన వర్షపాతం
జూన్ 124.5 99.5
జూలై 179.7 218.1