
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో శుక్రవారం శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో పారిశుధ్య పనులు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వనమహోత్సవంలో మొక్కలు నాటడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిస్తే తొలగించి, యజమానులకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. స్వచ్ఛ ఆటోలు డీఆర్‌సీ సెంటర్లకు వెళ్లాలని, జీపీఎస్ ట్రాకింగ్ రీడింగ్ రిపోర్ట్‌ను ప్రతిరోజు అందించాలన్నారు. డంప్‌యార్డ్‌కు వెళ్లే చెత్త వాహనాలను ఎవరు అడ్డుకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నీళ్లు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ లో చెత్త బయట వేయకుండా వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి, అందులో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ షట్టర్లను అద్దెకిచ్చే ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు.