
బాధ్యులను వదిలి.. ఆపరేటర్ బలి
● రేకుర్తిలో ఇంటి నంబర్ వ్యవహారం ● సహచరులను కాపాడే ప్రయత్నం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రేకుర్తిలో రేకులషెడ్డుకు ఇంటినంబర్ ఇచ్చిన బాధ్యులను కాపాడేందుకు కొంతమంది బల్దియా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తప్పు చేసిన ఉద్యోగులను వదిలేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్‌ను బలిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆపరేటర్‌ను సరెండర్ చేసి చేతులు దులుపుకోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నగరంలోనే అత్యంత వివాదాస్పద భూముల వ్యవహారం ఉన్న రేకుర్తిలో కొన్నేళ్లుగా ఇంటి నంబర్ల దందా కొనసాగడం తెలిసిందే. వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ఇంటి నంబర్లను సృష్టించడం ఇక్కడ ఒక విధానం. నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగానికి చెందిన కొంతమంది అధికారుల సహకారంతో ఖాళీ స్థలాలకు, చిన్న గదులకు ఇంటినంబర్లు ఇచ్చి, ఆ తరువాత ఆ స్థలాన్ని తమ సొంతం చేసుకుంటుంటారు. గతంలో చాలాసార్లు ఈ ఇంటి నంబర్ల దందా వెలుగు చూడడం, ఫిర్యాదులు రావడం, విచారణ చేపట్టడం, ఆనక వదిలేయడం ఇక్కడ ఏళ్లుగా జరుగుతున్న తంతు. అనంతరం షరామామూలుగానే ఈ దందా కొనసాగుతుంటుంది.
ఇల్లు లేకున్నా ఇంటి నంబర్
నగరంలో ఎక్కడైనా అసంపూర్తిగా ఉన్న ఇల్లు, రేకులషెడ్డుకు ఇంటి నంబర్లు కేటాయించేందుకు నిరాకరించే అధికారులు, రేకుర్తిలో రేకులతో వేసిన ఒక గదికి మాత్రం ఇంటినంబర్ కేటాయించారు. రేకులషెడ్‌కు ఇంటినంబర్ జారీ చేయడంలో కనీసం రూ.లక్ష చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ‘రేకుల గదికి ఇంటి నంబర్’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు.
ఆర్‌ఐ, ఆర్‌ఓలకు తెలియకుండా?
ఇంటి నంబర్ కావాలంటే సంబంధిత వ్యక్తి సెల్ఫ్ అసెస్‌మెంట్, ఇతరత్రా మార్గంలో ఆన్‌లైన్‌లో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీ)కి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు ఆపరేటర్ లాగిన్ నుంచి ఆర్‌ఐ లాగిన్‌కు, ఆర్‌ఐ నుంచి ఆర్‌వో లాగిన్, ఆర్‌వో లాగిన్ అనంతరం చివరగా ఎంసీ లాగిన్‌కు వెళ్తుంది. ఆర్‌ఐ లాగిన్‌కు రాగానే క్షేత్రస్థాయిలో విచారించాలి. దరఖాస్తుదారు పేర్కొన్న వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసి ఇంటినంబర్‌కు సిఫారసు చేయాలి. అక్కడ ఇల్లు లేకపోతే, అదే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్‌ఐ వివరాలు సక్రమంగా ఉంటే ఆర్‌వో ఆమోదించి, ఎంసీకి పంపిస్తారు. ఇంటినంబర్ వ్యవహారంలో ఆర్‌ఐ, ఆర్‌వోల రిపోర్ట్ కీలకం. లాగిన్ అవుతున్న ప్రతీసారి సంబంధిత అధికారికి ఓటీపీ వెళ్తుంది. ఆ అధికారి ఓటీపీ చెబితేనే లాగిన్ సాధ్యమవుతుంది. అంటే ఆర్‌ఐ, ఆర్‌వోలకు తెలియకుండా ఇంటినంబర్ జారీ అయ్యే అవకాశమే లేదు.
సహచరులను కాపాడేందుకు?
ఇంటినంబర్ల జారీలో ఒక ముఠాగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు సహచరులను కాపాడుకునే క్రమంలో ఆపరేటర్‌ను బలి చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆపరేటర్ లాగిన్ అయినా, ఆ స్థలంలో ఇల్లు ఉందా లేదా అనేది అధికారులే చూడాలి. ఆర్‌ఐ, ఆర్‌వోల రిపోర్ట్ ఆధారంగానే ఇంటినంబర్ జనరేట్ అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా గదికి ఇంటి నంబర్ జారీ చేసిన సదరు అధికారులను కాపాడే క్రమంలోనే ఆపరేటర్‌ను సరెండర్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహరంపై బల్దియా కమిషనర్ దృష్టి సారించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇంటినంబర్ల దందాకు ఫుల్‌స్టాప్ పెట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.