
ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ
● జూనియర్ కాలేజీలకు నిధులు ● జిల్లాలోని 10 కళాశాలల్లో వసతుల కల్పనకు రూ.1.29 కోట్లు
కరీంనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఏళ్లుగా నిధులు లేక వసతుల లేమితో సతమతమవుతున్న జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని 10 కళాశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ.1,29,70,000 నిధులు విడుదల చేసింది. వీటితో భవనాల మరమ్మతు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుద్ధీకరణ, తాగునీరు, గ్రీన్‌చాక్ బోర్డులు, డ్యూయల్ డెస్కులు, ఫ్యాన్లు, షెడ్లు, భవనాలకు రంగులు వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న జూనియర్ కళాశాలలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి.
10 కళాశాలలు
జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 4వేల మందికి పైగా చదువుతున్నారు. బోధన, బోధనేతర పరంగా కొరత పెద్దగా లేకపోయినా, సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ కృష్ణ ఆదిత్య తొలుత సంస్కరణలపై దృష్టిసారించారు. వాస్తవిక ఫలితాల కోసం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు తరగతి గదుల్లో, కళాశాల పరిసరాలు, ప్రిన్సిపాల్, అధ్యాపకుల గదుల్లోనూ కెమెరాలను బిగించే పనులు కొనసాగిస్తున్నారు. కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌రూం నుంచి బోధనను పర్యవేక్షిస్తూ ఇంటర్ విద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ గాడిలో పెడుతున్నారు. ప్రభుత్వ పరంగా విద్యార్థులకు పుస్తకాలు, నోట్స్, వసతులతో పాటు నీట్, ఎంసెట్, ఇతర కోర్సులకు ఉచిత కోచింగ్ ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలను ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నారు.
నిధుల మంజూరు ఇలా..
కళాశాల నిధులు(రూ.లక్షల్లో)
కరీంనగర్(ఆర్ట్స్ కళాశాల) 20,10,000
కరీంనగర్(సైన్స్ కళాశాల) 15,30,000
కరీంనగర్(బాలికలు) 4,50,000
మానకొండూర్ 28,10,000
గంగాధర 19,10,000
హుజూరాబాద్ 12,70,000
సైదాపూర్(వి) 11,40,000
జమ్మికుంట 11,50,000
వీణవంక 5,30,000
చిగురుమామిడి 1,70,000
ప్రవేశాలు పెరుగుతాయి
జిల్లాలోని 10 జూనియర్ కళాశాలలకు 1.29 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో మంచి రోజులు వచ్చినట్లే. అరకొర వసతుల నడుమ ఇప్పటి వరకు మెరుగైన ఫలితాలు సాధించాం. సౌకర్యాల కల్పనతో ప్రవేశాలు పెరుగుతాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచితవిద్య, పుస్తకాలు, నోట్‌బుక్స్, కోచింగ్‌ను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– వి.గంగాధర్, డీఐఈవో, కరీంనగర్

ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ