
వామ్మో.. ‘కత్తెర’ పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఆరుతడి పంటగా, అంతర పంటగా సాగు చేసిన మొక్కజొన్న పంటకు పురుగుల బెడద ఇబ్బందికరంగా మారింది. పంట దిగుబడులు ఏమో కాని.. పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పురుగు ఉధృతిని తగ్గించేందుకు రూ.వేల రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. గ్రామ చావడిల వద్ద రైతులు మొక్కజొన్నకు సోకిన కత్తెర పురుగు గురించే చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది.
విజృంభణ..
వానాకాలం సీజన్‌లో రైతులు 30వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఈసారి వర్షాలు మే చివరి వారంలోనే రావడంతో.. రైతులు మొక్కజొన్న పంటను విడిగా, పసుపు పంటతో కలిపి వేశారు. ఈ పురుగు పంట 15–20 రోజుల తొలి దశ నుంచి ఆశించి పంట చివరి దశ వరకు ఉంటుంది. ఈ పురుగు మూడు దశల్లో పంటను ఆశించి ఆకులను తినడంతో.. ఆకులపై రంధ్రాలు ఏర్పడి మొక్క మొగిలోకి చొరబడి పంటను ఎదగకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ పురుగు ఎక్కువగా యాసంగిలో వస్తుంది. కాని ఈసారి పెద్దగా వర్షాల్లేక కత్తెర పురుగుకు అనువైన వాతావరణం ఏర్పడడంతో ఎక్కువగా విజృంభించింది.
రూ.వేల ఖర్చు
పంట సాగుకే ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చవుతుంటే.. ఇప్పుడు కత్తెర పురుగుతో ఒక్కో రైతు కనీసం ఎకరాకు మరో రూ.5వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు 2, 3సార్లు రసాయన మందులు పిచికారీ చేశారు. మొక్క మొగిలో గుళికలు సైతం వేస్తున్నారు. పిచికారీ చేసేందుకు కూలీల ఖర్చు కూడా రైతులకు తడిసి మోపడవుతోంది. అయినా పురుగు ఉధృతి ఆగకపోవడంతో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తొలి దశలో నివారించాలి
లద్దె పురుగు జాతికి చెందిన కత్తెర పురుగు జీవిత కాలం 60 రోజుల వరకు ఉంటుంది. తల్లి పురుగులు(రెక్కల పురుగులు) గుంపులుగుంపులుగా మొక్కజొన్న కర్రపై గుడ్లను పెడుతుంటాయి. ఒక్కో గుంపులో 1,500–2,000 గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి బయటకొచ్చిన తర్వాత పురుగులు మొక్క ఆకులను గోకి తింటుండటంతో ఆకులకు రంధ్రాలు ఏర్పడతాయి. తర్వాత దశలో పురుగు పెద్దదవుతున్న కొద్ది మొక్క సుడిలోకి ప్రవేశించి రంపం మాదిరిగా కట్ చేస్తూ పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. పంట వేసిన దశలో గుడ్లు, చిన్న పురుగుల దశలో ఉంటాయి కాబట్టి నివారణ చర్యలు వెంటనే చేపడితే పంటను కాపాడుకునే అవకాశముంటుంది. ఇందుకోసం ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడంతోపాటు మధ్యస్థ దశలో వేప నూనెను పిచికారీ చేయడం ఉత్తమం.
వానాకాలం సీజన్‌లోనూ వేధిస్తున్న తెగులు
రసాయన మందులు పిచికారీ చేస్తున్న మొక్కజొన్న రైతులు
జిల్లాలో 30వేల ఎకరాల్లో సాగు
పిచికారీ చేసిన
మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించడంతో ఇప్పటికే రెండు, మూడుసార్లు రసాయన మందులు పిచికారీ చేసిన. మందులు, కూలీలకు కలిపి రూ.10వేల వరకు ఖర్చయ్యాయి. అయినా మొక్కజొన్న ఆకులకు ఇంకా రంధ్రాలు చేస్తూనే ఉన్నాయి.
– గడ్డం గంగారెడ్డి, చల్‌గల్
పురుగు ఉధృతిని గమనించాలి
మొక్కజొన్న పంట వేసిననుంచి కత్తెర పురుగు ఉధృతిని గమనిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి. గుడ్ల దశలోనే నివారణ చర్యలు తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చిన తర్వాత ఎక్కువ నష్టం కలిగిస్తాయి. లింగాకర్షక బుట్టలను పెట్టడంతోపాటు రసాయన మందులు పిచికారీ చేసి పురుగు ఉధృతిని నివారించొచ్చు.
– డాక్టర్ హరీశ్‌కుమార్‌శర్మ,
పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస

వామ్మో.. ‘కత్తెర’ పురుగు

వామ్మో.. ‘కత్తెర’ పురుగు

వామ్మో.. ‘కత్తెర’ పురుగు