
బండరాళ్లు దొర్లి పడి బాలుడి మృతి
● మరో బాలుడికి గాయాలు ● తల్లి కళ్ల ముందే బండల కింద తనయుడి విలవిల.. స్పృహ కోల్పోయిన తల్లి ● రేకులపల్లిలో విషాదం
సారంగాపూర్: అమ్మ పొలం వద్ద ఉందని వెళ్లిన ఓ బాలుడు అనంత లోకాలకు వెళ్లిన ఘటన రేకులపల్లిలో విషాదం నింపింది. బండరాళ్ల మీద కూర్చొని ఉన్న సమయంలో బండరాళ్లు కదిలి పడడంతో కడ ధనుశ్(11) మృతిచెందగా.. మరో బాలుడు కడ అఖిలేశ్(14) తీవ్రంగా గాయపడ్డాడు. రేకులపల్లి గ్రామానికి చెందిన కడ రాజేందర్–శిరీషకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ధనుశ్ బీర్‌పూర్ మండలంలోని తుంగూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో నాన్న రాజేందర్ గొర్లను మేపడానికి వెళ్లగా.. అమ్మ శిరీష పొలం పనులకు వెళ్లింది. అమ్మ ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నిస్తోంది. అమ్మ పొలం వద్దే ఉండడంతో ధనుశ్ వరసకు అన్న అయిన అఖిలేశ్(14)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోనే ట్రాక్టర్ కేజీవీల్స్‌తో దున్నుతుండడంతో పొలానికి మోటార్ల సహాయంతో నీరు పెట్టారు. పొలంలో మధ్యలో ఉన్న బిలుకు(బండలతో కూడి ఉన్న ఎత్తయిన ప్రాంతం)లో బండరాళ్లు కుప్పగా పెట్టి ఉండగా.. ధనుశ్, అఖిలేశ్ వాటిపై కూర్చొని ఫోన్ చూస్తూ, పొలం దున్నడాన్ని పరిశీలిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో తాము కూర్చొని ఉన్న బండరాళ్ల కిందికి పొలానికి పెట్టిన నీరు వచ్చి చేరుతోంది. ఈ విషయాన్ని వారు గమనించలేకపోయారు. బండల కిందికి పెద్దఎత్తున నీరు చేరడంతో ఒక్కసారిగా కుప్పగా ఉన్న రాళ్లు కదిలి ధనుశ్, అఖిలేశ్ బండల కుప్పపై నుంచి కింద పడిపోయారు. అందులోని ఓ పెద్ద రాయి ధనుశ్ తల, శరీరంపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అఖిలేశ్ కూడా గాయాలపాలయ్యాడు. ఒక్కసారిగా ఉహించని సంఘటన చూసిన ధనుశ్ తల్లి సొమ్మసిల్లిపోయింది. అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్, సమీపంలోని రైతులు వెంటనే 108లో వీరిని జగిత్యాలకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ధనుశ్ మృతిచెందాడు. అఖిలేశ్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బిలుకుపై పేర్చడంతోనే..
గడిచిన యాసంగి పూర్తయిన వెంటనే పొలం మధ్యలో అక్కడక్కడున్న పెద్దపెద్ద బండరాళ్లను ధనుశ్ తల్లిదండ్రులు పొక్లయిన్ సహాయంతో తొలగించి బిలుకుపై కుప్పగా పేర్చారు. బండలను తొలగిస్తే భూమి సేద్యం మరింత అనుకూలంగా ఉంటుందని భావించారు. అదే కుప్పపై సరదాగా ధనుశ్, అఖిలేశ్ కూర్చొని ప్రమాదానికి గురయ్యారు. ధనుశ్ తల్లిదండ్రులు, అఖిలేశ్ తల్లిదండ్రులు భూమేశ్వరి, వెంకటేశ్, గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అఖిలేశ్ బీర్‌పూర్ మండలం కొల్వాయి ఉన్నత పాఠశాలలో 9వతరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలాన్ని బీర్‌పూర్ ఎస్సై రాజు పరిశీలించారు. మృతదేహం పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.