వీణవంక: వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బావుల వద్ద నార్లు పోసిన రైతులు నాట్లు వేస్తున్నారు. మండల ప్రజలకు తాగు, సాగునీటికి ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడతారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో గత యాసంగిలో చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ రైతుల్లో కలవరం మొదలైంది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామం ప్రధాన కాల్వ నుంచి డీబీఎం–15 ప్రారంభమై పోతిరెడ్డిపేట మీదుగా బేతిగల్, వల్భాపూర్, నర్సింగాపూర్ గ్రామాల వరకు నీరు చేరుతుంది. దీని పరిధిలో 9 ఉప కాల్వలుండగా.. 1,200 ఎకరాలకు నీరు పారుతుంది. డీబీఎం–15 కాల్వ చెత్త, చెట్లతో పేరుకుపోయింది. చెట్లను తొలిగిస్తే దిగువన ఉన్న గ్రామాల వరకు నీరు చేరనుంది. కానీ అధికారులు చెట్లను తొలిగించకపోవడంతో రానున్న రోజుల్లో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు చేరదని రైతులు వాపోతున్నారు. పోతిరెడ్డిపేట బ్రిడ్జి నుంచి బేతిగల్ వరకు చెత్త పేరుకుపోయింది. జగ్గయ్యపల్లి– బేతిగల్ గ్రామాల మధ్య ఉన్న ఉప కాల్వ, కనపర్తి, వల్భాపూర్ గ్రామాలకు వెళ్లే ఉప కాల్వల దుస్థితి కూడా అధ్వానంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటిని విడుదల చేసే లోపు చెత్తను తొలిగించాలని కోరుతున్నారు.
డీబీఎం–15 కెనాల్‌లో పేరుకుపోయిన చెత్త
చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం
నీటిని వదిలే లోపు చెత్తను తొలగించాలంటున్న రైతులు