
డిజిటల్ పోలీసింగ్
● అధునాతన పరికరాలతో విధులు, నిరంతర తనిఖీలు ● సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌తో నగరంపై నిఘా ● వేగంగా సేవలందించేందుకు కృషి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీసులు అధునాతన టెక్నాలజీతో విధులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ పోలీసింగ్ అమలు చేస్తూ స్మార్ట్‌గా ముందుకు సాగుతున్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు.. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. రేయింబవళ్లు తనిఖీలు చేస్తూ.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ సంఘటనలు జరిగినప్పుడు మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నగరంలో వందలాది సీసీ కెమెరాలతో 24గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు.
సరికొత్త పరికరాలు
వాహనాలకు ఏర్పాటుచేసిన బ్లాక్‌ఫిల్మ్‌ను గుర్తించేందుకు టింట్ మీటర్, సౌండ్ పొల్యూషన్‌ను గుర్తించే వాయిస్ సౌండ్ లెవల్ మీటర్, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో డిజిటల్ బ్రీత్ అనలైజర్, పాత నేరస్తులను పట్టుకునేందుకు పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ వినియోగిస్తున్నారు. నిత్యం రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ.. పాత నేరస్తులను పట్టుకుంటున్నా రు. విధుల్లో బాడీవార్న్ కెమెరాలు, ఈపెట్టీ కేసుల నమోదుకు ట్యాబ్స్ వినియోగిస్తున్నారు. షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటూ రద్దీ ప్రాంతాల్లో పోకిరీల ఆగడాలను అరికట్టడానికి బటన్ కెమెరాలు వాడుతున్నారు. స్పీడ్ హంటర్ ద్వారా అధికవేగంతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధిస్తున్నారు.
769 కెమెరాలతో సిటీపై నిఘా
నగరం 769 కెమెరాల నిఘాలో ఉంటోంది. ఇటీవల కరీంనగర్ బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌లోని సీసీటీవీల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. నగరంలో సర్వేలెన్స్ కెమెరాలు 335 ఉన్నాయి. పీటీజెడ్ కెమెరాలు 35, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు 24, ఆర్‌ఎల్‌వీడీ కెమెరాలు 85, ఏఎన్‌పీఆర్ కెమెరాలు 174, 60 స్పీడ్ డిటెన్షన్ కెమెరాలు, ఎవిడెన్స్ కెమెరాలు 20, ఏఎన్‌పీఆర్ కెమెరాలు 40, రాంగ్‌రూట్ కెమెరాలు పదిస్థానాల్లో 30 ఏర్పాటు చేశారు. నగరంలోని 24 జంక్షన్లలో 85 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుంది.

డిజిటల్ పోలీసింగ్