
రేకుర్తి..
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
ఇంటి నంబర్ల కక్కుర్తి!
● విచారణ మొదలుపెట్టిన విజిలెన్స్ ● యజమానులను పిలిచి ప్రశ్నిస్తున్న అధికారులు ● విలీనమయ్యాక ఇంటి నంబర్లు ఎలా వచ్చాయని ఆరా? ● కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు నష్టం ● గూగుల్ మ్యాప్స్‌లో ఇండ్లు కట్టనేలేదని గుర్తించిన అధికారులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
ఎంత పెద్ద నేరస్తుడైనా.. ఏదో చిన్న క్లూ వదిలేసి వెళ్తాడు. ‘సీఎం చచ్చిపోతే మీరు సీఎం అవుతారు.. కానీ, సీఎంను చంపితే మీరు నేరస్తులవుతారు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?’ అంటూ ఓ పోలీసు అధికారి ఓ సినిమాలో ప్రశ్నిస్తాడు. సరిగ్గా ఇలాగే ఉంది కరీంనగర్ బల్దియా అధికారుల తీరు.. రేకుర్తి పరిధిలో వందలాది ఇంటి నంబర్లు అడ్డదారిలో జారీ చేసిన అధికారులు.. ఆ సమయంలో గూగుల్ మ్యాప్స్‌లో ఇండ్లు చూడొచ్చన్న చిన్న లాజిక్కుతో అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు అధికారుల జేబుల్లో పడగా.. అంతకుమించి బల్దియా ఖజానాకు గండి పడింది. దీనిపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెంటనే.. అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో అనుమానాస్పద ఇంటి నంబర్ల యజమానులను విజిలెన్స్ కార్యాలయానికి పిలిచి విచారణ చేపడుతున్నారు. ‘మీ ఇంటి నంబర్లు ఎలా వచ్చాయి? ఎంతకాలం కింద భూములు కొన్నారు? ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు?’ తదితర వివరాలపై కూపీ లాగుతున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో పరిశీలించిన అధికారులకు ఆ సమయంలో అసలు ఇండ్లే కట్టలేదని నిర్ధారించడం కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
31–07–2018 తేదీతో రేకుర్తి గ్రామపంచాయతీ గడువు ముగిసింది. ఆ తర్వాత సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. 2019 మార్చిలో కరీంనగర్ కార్పొరేషన్‌లో రేకుర్తి విలీనం అయింది. అనంతరం రేకుర్తి గ్రామపంచాయతీకి సంబంధించిన దాదాపు 33 రకాల అంశాల రికార్డులు, చెక్‌బుక్కులతో సహా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్వాధీనం చేశారు. అందులో అన్నిరకాల రికార్డులు భద్రంగా ఉన్నాయి. కానీ, గృహ నిర్మాణ అనుమతి రిజిస్ట్రార్ మాత్రం గల్లంతైంది. ఈ కారణాన్ని సాకుగా చూపి.. 2019 నుంచి కరోనా దాకా అనేక రేకుర్తి గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు ఇండ్లు లేకున్నా పుట్టుకొచ్చాయి. వాస్తవానికి ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఉండాలి. బల్దియాలో ఆర్‌ఐ, ఆర్వో క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి. వాళ్లు సరే అంటే.. డిప్యూటీ కమిషనర్, కమిషనర్ ఆమోదంతో ఇంటి నంబరు జనరేట్ అవుతుంది. కానీ, బల్దియా సిబ్బంది కొత్త ఇంటి నంబర్లు పాత రికార్డులలో ఎంటర్ చేసి ఇవ్వడం ప్రారంభించారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారాయి. వీటిలో అత్యధికంగా 2019 మార్చి 11వ తేదీన రేకుర్తి గ్రామపంచాయతీ రికార్డులో నమోదు చేయడం గమనార్హం.
85 మంది ఇంటి యజమానుల విచారణ
రేకుర్తి పాత గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు పొందిన వైనంపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. 2019 తరువాత పాత గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు పొందిన అనుమానాస్పద ఇంటి యజమానులకు విజిలెన్స్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. వారంతా అధికారుల ముందు హాజరయ్యారు. అధికారులు వారిని ఇంటి నంబర్లు ఎప్పుడు వచ్చాయి? ఇంటి అనుమతి పత్రాలు, ఎల్‌ఆర్‌ఎస్, ఇంటినంబరు కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు? ఏ రోజు ఇంటి నంబరు వచ్చింది? తదితర ప్రశ్నలను యజమానులను అడిగారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు కొత్త విషయాలు తెలుసుకున్నారు. వాస్తవానికి వీరంతా 2019 లేదా 2018లో ఇంటి నిర్మాణ అనుమతి పొంది ఉంటే అదే సమయంలో నిర్మాణం ప్రారంభించి ఉండాలి. కానీ, గూగుల్ మ్యాప్స్‌లో విజిలెన్స్ అధికారులు పరిశీలించినప్పుడు.. అసలు ఆ సమయంలో ఇండ్లే లేవని గుర్తించారు. దీంతో ఇంటి నంబర్ల జారీ అంతా ఉత్తిదేనని తేలిపోయింది. కాకపోతే, మరింత మంది ఇంటి యజమానులను విచారించాల్సి ఉన్నందున వారి స్టేట్‌మెంట్లు కూడా తీసుకుని నివేదిక రూపొందించనున్నారు. ఇంటినంబర్లు నకిలీవని తేలిన దరిమిలా.. బల్దియాలో భారీ భూకంపమే రానుంది.
న్యూస్‌రీల్

రేకుర్తి..